శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలో వైసీపీ నేత, ఎమ్మెల్యే రెడ్డి శాంతి టెన్షన్ పడుతున్నారా? ఏం చేయాలో ఎలా ముందుకు వెళ్లాలో తెలియక ఇబ్బంది పడుతున్నారా? అంటే.. స్థానిక నాయకులు ఔననే అంటున్నారు. రెడ్డి శాంతి ఇక్కడ విజయం సాధించేందుకు చాలానే కష్టపడ్డారు. వీధి వీధి తిరిగి ప్రచారం చేశారు. నియోజకవర్గంలో సమస్యలు పేరుకుపోయాయని, వాటిని పరిష్కరిస్తానని ఆమె ఇక్కడి వారికి హామీలు ఇచ్చారు. వాస్తవానికి ఈ నియోజకవర్గంలో ఎప్పుడూ.. కాంగ్రెస్ అనుకూల ఓటుబ్యాంకు ఎక్కువగా ఉంది. టీడీపీకి కూడా ఇక్కడి ప్రజలు బ్రహ్మరథం పట్టారు.
అయితే, ఎప్పుడూ కూడా ఒకే పార్టీని ఇక్కడి ప్రజలు భుజాన వేసుకున్నది లేదు. అయితే, దీనికి భిన్నంగా 2009లో కాంగ్రెస్‌ను గెలిపించిన ఇక్కడి ప్రజలు.. 2014 ఎన్నికల్లో వైసీపీని అక్కున చేర్చుకున్నారు. కలమట వెంకట రమణమూర్తిని ఇక్కడి ప్రజలు గెలిపించారు. అయితే, తర్వాత కాలంలో ఈయన చంద్రబాబు కు జై కొట్టారు. కనీసం జగన్‌కు ఒక్కమాట కూడా చెప్పకుండానే స్వతంత్రంగా వ్యవహరించారు. దీంతో వైసీపీలో రెడ్డి శాంతికి అవకాశం లభించింది. ఈ అవకాశం వినియొగించుకున్న శాంతి..అనూహ్యంగా పార్టీపై పట్టు సంపాయించుకుని గత ఏడాది ఎన్నికల్లో విజయం సాధించారు. మంచి వాక్చాతుర్యం.. విపక్షంపై విమర్శలు గుప్పించే నాయకురాలిగా కూడా గుర్తింపు సాధించారు.
అయితే, ఇప్పుడు ఆమె కొంత టెన్షన్‌కు గురవుతున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది. గతంలో ఇదే ని యోజకవర్గం నుంచి గెలిచి టీడీపీకి అనుకూలంగా మారిన కలమట.. తిరిగి వైసీపీలోకి వచ్చేందుకు లైన్ క్లియర్ చేసుకుంటున్నారని సమాచారం. దీనికి స్థానిక వైసీపీ కీలక నాయకుడు ఒకరు చక్రం తిప్పుతున్నా రని, ఆయన మాటకు తిరుగులేకపోవడంతో ఖచ్చితంగా రేపో మాపో.. కలమట తిరిగి నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహించడం ఖాయమనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇప్పటికీ.. కలమట నేతృత్వంలోనే చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి. కలమటను ఒక సీనియర్ నాయకుడు ప్రోత్సహిస్తుండడంతో రెడ్డి శాంతి గందరగోళంగా ఉన్నారని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.