కొత్త టీటీడీ బోర్డు ఏర్పాటు అయ్యాక భక్తులకు అనేక రకాల సౌలభ్యాలు ఏర్పాటు చేయడానికి కంకణం కట్టుకుంది. అందులో భాగంగానే వచ్చే నెల ఒకటో తారీకు నుంచి కళ్యాణోత్సవ సేవా టిక్కెట్ల కోటాను పెంచేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు నిర్ణయించుకుంది. ప్రస్తుతం ఉన్న వెయ్యి టిక్కెట్లను రెండు వేలకు పెంచింది టిటిడి బోర్డు. అంతే కాక ఆర్జిత బ్రహ్మోత్సవం, డోలోత్సవం అలానే సహస్ర దీపాలంకరణ సేవ టికెట్లను 500 చొప్పున ఆన్లైన్లో భక్తులకు టిటిడి అందుబాటులో ఉంచింది.
అలాగే ఈ మూడు సేవల్లో పాల్గొనే భక్తులు స్వామివారి దర్శనానికి వెళ్లాలంటే ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కొనుగోలు చేయాలని కూడా టిటిడి నిబంధన విధించింది. ఇక నిన్ననే శ్రీవారి దర్శనం కోసం భక్తులకు రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల నవంబరు కోటా విడుదల చేసింది. భక్తుల సౌకర్యార్థం నవంబరు నెలకు సంబంధించి రూ.300/- టికెట్ల కోటాను నిన్న ఉదయం 11.00 గంటలకు ఆన్‌లైన్‌లో ఉంచారు. భక్తులు ఆన్‌లైన్‌లో ముందస్తుగా రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను బుక్ చేసుకోవాలని టీటీడీ కోరింది.