రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ ప్రజల్లోకి చొచ్చుకుపోయిందని మాజీ మంత్రి కన్నబాబు వ్యాఖ్యానించారు. వాలంటీర్, సచివాలయ వ్యవస్థల వల్లే ప్రభుత్వ పథకాలు ప్రజలకు నేరుగా అందుతున్నాయని చెప్పారు. జన్మభూమి కమిటీలు వంటి దళారీ వ్యవస్థను వాలంటీర్, సచివాలయాలతో నిర్మూలించినట్లు తెలిపారు. వాలంటీర్లను చంద్రబాబు చులకన చేసి మాట్లాడారని.. వాలంటీర్ వ్యవస్థను తీసేస్తామని చంద్రబాబు చెప్పగలరా అని ఆయన ప్రశ్నించారు. ఇదిలా ఉంటే.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సుపరిపాలనను క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరవేస్తున్న వలంటీర్లపై చంద్రబాబు అండ్ టీంకు గుబులెందుకని మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ప్రశ్నించారు.
ఈ మేరకు శుక్రవారం జిల్లా పార్టీ కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. గ్రామ వలంటీర్ల వ్యవస్థపై ఎల్లో మీడియాలో రాస్తున్న విషపు రాతలను రాష్ట్ర ప్రజలంతా ఛీ కొడుతున్నారని మండిపడ్డారు. ప్రజల కష్టసుఖాల్లో వారి జీవితాల్లో విడదీయలేని భాగమైన ఈ వ్యవస్థపై దేశంలోని ఇతర రాష్ట్రాలు ప్రత్యేక అధ్యయనాలు చేస్తూ తమ రాష్ట్రాల్లో ప్రవేశపెట్టాలని సన్నాహాలు చేయడం వారి కళ్లకు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు.