శ్రీరామనవమి శోభా యాత్ర సందర్భంగా సీతారామ్ బాగ్ లోని ద్రౌపది గార్డెన్లో అన్ని శాఖల అధికారులతో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ ఆనంద్ మాట్లాడుతూ.. శ్రీరామ నవమి శోభా యాత్ర శాంతియుతంగా, సంతోషంగా జరుపుకోవాలి. హైదరాబాదు సిటీ పోలీసు తరపున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శోభయాత్ర ప్రారంభం నుండి ముగింపు వరకు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నాము. శోభా యాత్ర శాంతియుతంగా జరిగేందుకు ప్రజలు, ఉత్సవ సమితి నిర్వాహకులు పోలీసులకు సహకరించాలి. మరియు శోభయాత్ర మధ్యాహ్నం 1 గంటల
వరకు ప్రారంభించే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని కోరారు.
గతంలో జరిగిన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, శోభా యాత్ర దారులు చాలా చిన్నగా ఉండటం వలన, పెద్ద టస్కర్ వాహనాలు వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది, కావున ముందస్తుగా వాహనాలతో ఒక ట్రయల్ రన్ ఏర్పాటు చేసుకోవాలని ఉత్సవ సమితి సభ్యులకు సీపీ సూచించారు. ఎవరైనా డ్రోన్లు వాడాలనుకుంటే ముందుగా పోలీసుల అనుమతి తీసుకోవాలని చెప్పారు. శోభా యాత్రలో ఇతర వర్గాలను కించ పరిచే విధంగా పాటలు, స్పీచ్లు లేకుండా చూసుకోవాలని నిర్వాహకులను కోరారు. నిరంతరం సీసీ కెమెరాల ద్వారా యాత్రను పర్యవేక్షిస్తామని తెలిపారు. శోభా యాత్రలో నిర్వాహకులు, ప్రజలు నిబంధనలు పాటించి, భక్తి శ్రద్దలతో పండుగలు జరుపుకోవాలని కోరారు.