నిజామాబాద్ జిల్లాలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. సాధారణంగా ఎవ్వరైనా మరణించిన వారికి అంత్యక్రియలు చేస్తుంటారు. 3,5,9 రోజులలో చిన్న చిన్న కార్యక్రమాలు.. ఆ తరువాత 10 రోజుల తరువాత పెద్ద కర్మ నిర్వహిస్తారు. నెల రోజుల పంక్షన్, ఏడాదికి వర్థంతి ఇలా నిర్వహిస్తుంటారు. అవి కేవలం చనిపోయిన వారికి మాత్రమే జరుపుతుంటారు. కానీ కన్న తండ్రే.. బతికున్న కూతురికి పెద్దకర్మ చేసిన ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
గతంలో పెద్ద కూమార్తెకు తండ్రి మహేష్ పెళ్లి చేశారు. పెళ్లి జరిగిన కొద్దిరోజులకే అల్లుడికి బోన్ క్యాన్సర్ అని బయటపడింది. దీంతో భర్తకు క్యాన్సర్ కారణంగా కూతురు తిరిగి తల్లి గారింటికి వచ్చి చేరింది. అయితే కొద్ది రోజులకే ఆమె ప్రేమించిన వ్యక్తితో కూతురు ఇంట్లో నుంచి వెళ్లి పోయింది. దీంతో కూతురిపై తండ్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఏకంగా కూతురు చనిపోయిందంటూ మహేష్ ఫ్లెక్సీ ఏర్పాటు చేశాడు. బతికి ఉండగానే కూతురికి పెద్దకర్మ చేశాడు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెను చర్చకు దారి తీసింది. 10-09-2023 కూతురు చనిపోయిందంటూ పెద్ద కర్మ నిర్వహించాడు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.