కాశ్మీర్లోని తులిప్ గార్డెన్.. నాలుగు దిక్కులా ఎటు చూసినా తులిప్ పువ్వులే మనకు దర్శనమిస్తాయి. తెలుపు, పసుపు, పింక్.. ఇలా రక రకాల రంగుల్లో.. ఆకాశం నుంచి చూస్తే.. ఇంద్ర ధనుస్సు నేల మీద విరిసిందా.. అన్నట్లుగా ఆ తులిప్స్ తమ అందాలతో మనకు కనువిందు చేస్తాయి. చూపరులను ఇట్టే ఆకర్షిస్తాయి. సృష్టిలోని అందమంతా తమలోనే దాగుందన్నట్లు.. పర్యాటకుల చూపును తమవైపు తిప్పుకుంటాయి. అయితే.. కరోనా లాక్‌డౌన్ కారణంగా ఇప్పుడా తులిప్ గార్డెన్ పర్యాటకులు లేక వెలవెలబోతోంది.
పర్యాటకులు లేకపోతేనేం.. మేం చేసే పని మేం చేస్తాం.. అన్నట్లుగా.. ఆ తులిప్స్ యథావిధిగా విరబూశాయి. అద్భుతమైన వర్ణశోభిత దృశ్యాలతో మన కళ్లకు ఇంపుగా ఆ తులిప్స్ విరబూసి మనకు దర్శనమిస్తున్నాయి. వాటిని చూసేందుకు నిజంగా మన రెండు కళ్లూ చాలవంటే అతిశయోక్తి కాదు.
2007లో అప్పటి కాశ్మీర్ ప్రధాని గులాం నబీ ఆజాద్ కాశ్మీర్‌లోని ఇందిరా గాందీ మెమోరియల్ తులిప్ గార్డెన్‌ను పర్యాటకుల సందర్శన నిమిత్తం ప్రారంభించారు. అయితే ప్రస్తుతం కరోనా లాక్‌డౌన్ కారణంగా పర్యాటకులు లేక ఆ గార్డెన్ వెలవెలబోతోంది. అయినప్పటికీ తులిప్స్ మాత్రం తమ అందాలతో కనువిందు చేస్తున్నాయి.
కాశ్మీర్ తులిప్ గార్డెన్‌లో రకరకాల తులిప్ వెరైటీలను మనం చూడవచ్చు. డాఫోడిల్స్, హయాసింత్స్ ఇలా పలు తులిప్ వెరైటీలు మనకు కనిపిస్తాయి.
దాల్ లేక్ సమీపంలో జబర్‌వాన్ రేంజ్‌లోని పర్వతసానువుల్లో ఈ గార్డెన్ ఉంది. ఇది ఆసియాలోనే అతి పెద్ద తులిప్ గార్డెన్‌లలో ఒకటి కావడం విశేషం.