రాజకీయాల్లో విమర్శలు ఎప్పుడైనా అర్ధవంతంగా ఉండాలి. ఎవరైనా నాయకులు ప్రత్యర్ధుల మీద చేసే విమర్శలు నిర్మాణాత్మకంగా ఉండాలి. అలా కాకుండా ఏదో రాజకీయంగా బట్ట కాల్చి మీద వేయడం వల్ల పెద్దగ్ ప్రయోజనం ఉండదు. ఎందుకంటే ప్రస్తుతం రాజకీయాలపై ప్రజలకు అవగాహన ఉంటుంది. పైగా మీడియా ప్రభావం ఎక్కువైన దగ్గర నుంచి ఏ నాయకుడు ఎలా రాజకీయం చేస్తున్నారో తెలుస్తోంది.
అలాంటప్పుడు నాయకులు మాట్లాడే మాటలకు అర్ధం ఉండాలి. అలా లేకపోతే నాయకుల మాటలకు విలువలు ఉండవు. తాజాగా తెలంగాణలో వైఎస్సార్టీపీ పార్టీ రాజకీయాలు చేస్తున్న షర్మిల విమర్శలు కూడా అలాగే ఉన్నాయని తెలుస్తోంది. తాజాగా ఆమె ఓ న్యూస్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలక సిఎం కేసిఆర్ చేతుల్లో ఉందంటూ మాట్లాడారు. ఓటుకు నోటు కేసు ప్రస్తావన తీసుకొచ్చి…కేసిఆర్ చేతుల్లో రేవంత్ పిలక ఉందని, ఆయన ఎప్పుడు కావాలంటే అప్పుడు పిలక కాదు… మెడ తీసేయగలడని అన్నారు.
కేసిఆర్ చెప్పినట్లు రేవంత్ వింటున్నారనే విధంగా షర్మిల మాట్లాడారు. అయితే ఓటుకు నోటు కేసు ఏ విధంగా వచ్చిందో అందరికీ తెలుసని, కేసిఆర్ చేతిలో రేవంత్ ఉంటే, టిపిసిసి అధ్యక్షుడుగా రేవంత్ ఇంత పోరాటం చేయాల్సిన అవసరం ఏముందని కాంగ్రెస్ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. పైగా కేసిఆర్‌తో సహ ఇతర ప్రత్యర్ధులు రేవంత్‌ని ఏ విధంగా టార్గెట్ చేశారో తెలుసని, పైగా ఆయన చంద్రబాబు మనిషి అంటూ విమర్శలు చేస్తారని, కానీ షర్మిల ఏమో కేసిఆర్ చెప్పినట్లు చేస్తారని అంటున్నారని, ప్రత్యర్ధులుగా వీరు చేసే మాటల్లో ఎలాంటి వాస్తవాలు లేవని అంటున్నారు.
కేసిఆర్-రేవంత్‌ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా రాజకీయం నడుస్తోందని, అలాంటప్పుడు మరీ గుడ్డిగా విమర్శలు చేస్తే ప్రజలు నమ్మే పరిస్తితిలో లేరని చెబుతున్నారు. రేవంత్‌ని దెబ్బకొట్టడానికే షర్మిల ఈ తరహా రాజకీయం చేస్తున్నారని కాంగ్రెస్ శ్రేణులు ఫైర్ అవుతున్నాయి.