సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించాయి గులాబీ పార్టీ శ్రేణులు. గతంలో లాగా బ్యానర్లు, ప్రకటనలతో ప్రచారం హోరెత్తించకుండా కేవలం మొక్కలు నాటేందుకు ప్రాధాన్యత ఇచ్చాయి పార్టీ శ్రేణులు. అయితే పార్టీలో ప్రభుత్వంలో కీలక స్థానంలో ఉన్న మంత్రి తలసాని కుటుంబం మాత్రం ఎక్కడా తగ్గలేదు..తమదైన మార్క్ హడవిడితో హల్ చల్ చేశారు. పుట్టినరోజు వేడుకలు నిరాడంబరంగా జరపాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చినా తలసాని మాత్రం ఓ రేంజ్ లో హడావిడి చేశారు. దీనిపై ఇప్పుడు గులాబీశ్రేణుల్లో ఆసక్తికర చర్చ నడుస్తుంది.
కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పార్టీ శ్రేణులంతా మొక్కలు నాటి తమ నేతకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి తలసాని మాత్రం నెక్లెస్ రోడ్డులోని జలవిహార్ లో ప్రత్యేక కార్యక్రమాలు హంగు ఆర్భాటాలతో పార్టీలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యారు. బల్కంపేటలోని ఎల్లమ్మ గుడిలో అమ్మవారికి రెండున్నర కిలోల బంగారు చీర కూడా సమర్పించారు.
పార్టీలోని కీలక నేతలను ఆహ్వానించి జలవిహార్లో వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. మొక్కలు నాటే కార్యక్రమంతో పాటు కేసీఆర్పై రూపొందించిన డాక్యుమెంటరీతో పాటు ఆలయాలు, మసీదులు, చర్చిలు, గురుద్వారాల్లో ప్రత్యేక ప్రార్థనలు ఒకటేమిటి నగరవ్యాప్తంగా తలసాని తనయుడు సాయి హల్ చల్ చేశారు. అయితే పార్టీలో మిగిలిన కీలక నేతలు ,కేసీఆర్ సన్నిహితులు సైతం నిరాడంబరంగా కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు జరిపితే తలసాని ఈ రేంజ్ లో ఎందుకు హడావిడి చేశారన్న చర్చ ఇప్పుడు గులాబీ శ్రేణుల్లో నడుస్తుంది.
తలసాని టీఆర్ఎస్ లో చేరినప్పటి నుంచి సీఎం కేసీఆర్ ప్రాధన్యత ఇస్తూ సముచిత స్థానాన్నే కట్టబెట్టారు. ఇక రెండు విడతల్లో మంత్రివర్గంలోనూ కీలకశాఖలే కట్టబెట్టారు. తలసాని కుమారుడు సాయి కిరణ్ యాదవ్ కి సైతం స్థాయికి మించి సికింద్రాబాద్ ఎంపీ సీటు గత ఎన్నికల్లో కేటాయించారు. తనయున్ని భారీ మెజార్టీతో గెలిపించుకొస్తానన్న తలసాని తీరా ఫలితాలొచ్చాక షాక్ అయ్యారు. తన సొంత నియోజకవర్గం సనత్ నగర్ లో సైతం 12 వేలకు పైగా వెనకబడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి 19 వేల మెజార్టీతో తలసాని విజయం సాధించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన కిషన్ రెడ్డికి తలసాని అత్యుత్సాహం మంచి బ్రేక్ ఇచ్చిందనే చెప్పాలి. సికింద్రాబాద్ ఎంపీగా విజయం సాధించిన కిషన్ రెడ్డి ఏకంగా హోంశాఖ సహాయమంత్రి అయ్యారు. ఇది కేసీఆర్ ముందు తలసానికి పెద్ద డ్రా బ్యాక్ గా మారింది. ఇక గ్రేటర్ కార్పోరేషన్ ఎన్నికల్లోను తలసాని బాధ్యతలు తీసుకున్న చోట టీఆర్ఎస్ కి ఆశించిన మేర ఫలితాలు రాలేదు. కేటీఆర్ సీఎం గా బాధ్యతలు చేపడితే గ్రేటర్ నుంచి మంత్రివర్గంలోను పలు కీలక మార్పులుంటాయని ప్రచారం జరిగింది. తలసానికి పార్టీ బాధ్యతలు అప్పగించి దానం నాగేందర్ కి మత్రివర్గంలో ప్రాధాన్యత ఇస్తారన్న చర్చ ఈ మధ్యకాలంలో జరిగింది.
ఇక ఈ ప్రచారాలన్నిటికి చెక్ పెడుతు కేసీఆర్ కి తామే అసలైన వారసులమన్న రేంజ్ లో తలసాని కుటుంబం కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను ఇంత ఆడబంరంగా నిర్వహించిందా అన్న చర్చ టీఆర్ఎస్ శ్రేణుల్లోనే నడుస్తుంది.