రాష్ట్రవ్యాప్త పాదయాత్రకు రేవంత్ సిద్దమయ్యారా

-

కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వేర్వేరుగా రైతు రణభేరి పేరుతో యాత్రలు చేస్తున్నారు. ఈ పాదయాత్రల్లో భాగంగా రేవంత్ అచ్చంపేట నుంచి పాదయాత్ర చేసి రావిరాలలో ముగించారు. ముంగింపులో భారీ సభను ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించారు రేవంత్.

త్వరలోనే తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేయడానికి సిద్ధమన్నారు ఎంపీ రేవంత్ రెడ్డి. పాదయాత్ర ముగింపు సభలో చేసిన ఈ ప్రకటన పార్టీలో కొత్త చర్చకు దారితీసింది. సభలో మాజీ మంత్రి కొండా సురేఖ సీనియర్లకు చురకలంటేలా చేసిన వ్యాఖ్యలు కుడా హాట్ టాపిక్ గా మారాయి. అయితే ఈ సభ మీద కూడా కాంగ్రెస్ పార్టీలో అతర్గతంగా అసమ్మతి వ్యక్తం అయింది. పలువురు సీనియర్ నేతలు గైర్హాజరయ్యారు.

రేవంత్ రెడ్డి పాదయాత్ర ముగింపు సందర్భంగా హైదరాబాద్ శివారులోని రావిరాలలో రైతు రణభేరి సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో రేవంత్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తొందరలోనే తెలంగాణ అంతా పాదయాత్ర చేస్తానని, ఏఐసీసీ నుంచి అనుమతి కూడా తీసుకుంటానన్నారు. కాంగ్రెస్ సునామీ సృష్టిస్తా… కేసీఆర్ ని సునామిలో ముంచుతానన్నారు రేవంత్. మరోవైపు తన సామాజిక వర్గాన్ని దగ్గరికి తీసుకునే ప్రయత్నంలో పడ్డారు రేవంత్. కేసీఆర్ ని గద్దె మీద నుంచి తోసి వ్యవసాయాన్ని కాపాడుకోవడానికి రెడ్ల వెంట రారా.. అని ప్రశ్నించారు.

కాంగ్రెస్ లోని సీనియర్లపై మాజీమంత్రి కొండ సురేఖ చురకలు వేశారు. తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ విలీనం అవుతుంది..మనకు తిరుగుఉండదని అధిష్టానానికి చెప్పారు…ఇప్పుడు ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. వైఎస్ పాదయాత్ర మీద కూడా ఫిర్యాదులు వెళ్లాయని.. ఇప్పుడు కూడా మళ్లీ ఫిర్యాదులు చేయడం సరికాదన్నారు. ఉత్తమ్ పార్టీ కోసం కష్టపడ్డారు..కానీ ఆయన క్లాస్ లీడర్. రేవంత్ లాంటి మాస్ లీడర్ కావాలని కోరారు.

కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జగ్గారెడ్డి, ఉత్తమ్, వీహెచ్‌ లాంటి వాళ్ళు ఈ సభకు డుమ్మా కొట్టారు. అయితే ఉత్తమ్ నల్గొండ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఇక సీఎల్పీ నేత భట్టి విక్రమార్క రైతు ముఖాముఖికి వెళ్లడం తో సభకు రాలేక పోయారనే టాక్‌ ఉంది.మొత్తానికి పాదయాత్రతో పార్టీ అధిష్ఠానానికి రేవంత్ తన బలాన్ని ప్రదర్శించినట్టైందనే టాక్‌ నడుస్తోంది.

ఇక రేవంత్ పాదయాత్ర ముగుస్తుంది అనుకుంది పార్టీ లోని ఓ వర్గం. కానీ మరో దఫా పాదయాత్ర కు సిద్ధమౌతున్నారు రేవంత్. అధిష్టానం అనుమతి తీసుకుని యాత్ర చేస్తా అని రేవంత్ చెప్పడం తో మళ్ళీ చర్చ మొదలైంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version