కేంద్ర పథకాలు విషయంలో బీజేపీ నేతలు చెబుతున్నవన్నీ అబద్దాలే నని అన్నారు సీఎం కేసీఆర్. పెన్షన్ విషయంలో లెక్కలు తీస్తే ఎవరు ఎక్కువ నిధులు వెచ్చిస్తున్నారో తేలుతుందన్నారు. తన మాటలు నిజం కాదని నిరూపిస్తే.. ఒక్క నిమిషంలో రాజీనామా చేస్తానని సవాల్ చేశారు కేసీఆర్.
వ్యవసాయ బిల్లుతో కేంద్రం రైతుల నెత్తిన బండ వేసిందని సీఎం కేసీఆర్ ఆక్షేపించారు. బిల్లు వద్దని ఎంత గొంతుచించుకున్నా… కేంద్రం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
ఇవాళ ఉత్తరభారతం రగిలిపోవడానికి కారణం కేంద్రమే అన్నారు. వ్యవసాయ బిల్లుపై కేంద్రం ఒంటెత్తుపోకడ వల్ల రైతులు అన్యాయమైపోతారని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. పంట అమ్ముకోలేక రైతులు నానా అవస్తలు పడాల్సిందేన్నన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో ప్రతి భూమిని సర్వే చేయిస్తామని కేసీఆర్ అన్నారు. త్వరలో భూమి సర్వే చేపట్టనున్నట్లు ప్రకటించారు. టెక్నాలజీతో మార్పులకు వీలులేకుండా భూహద్దులు నిర్ణయించి ఇస్తామన్నారు.