ఇవాళ ప్రగతి భవన్ లో ప్రెస్ మీట్ నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు… మరోసారి బండి సంజయ్ కుమార్ ను టార్గెట్ చేసి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతిసారి తనను జైల్లో పెడతానని బండి సంజయ్ చెబుతున్నాడని.. దమ్ముంటే నన్ను జైల్లో వేసి చూపించాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ కు ఛాలెంజ్ విసిరారు సీఎం కేసీఆర్. అవినీతి చేసిన వాళ్ళు భయపడతారని.. తాము ఎలాంటి అవినీతికి పాల్పడలేదని స్పష్టం చేశారు.
మీ సి.బి.ఐ, ఈడి కేసులకు తాము భయపడబోమని స్పష్టం చేశారు. నరేంద్ర మోడీ ప్రభుత్వంలో అవినీతి కంపు కొడుతోంది అని మండిపడ్డారు. త్వరలోనే బిజెపి నాయకులను జైల్లో వేస్తామని హెచ్చరించారు. ప్రధాని మోదీ రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని.. పార్లమెంట్‌లో ఆమోదం పొందకముందే బిల్లును అమలు చేస్తున్నారని అగ్రహించారు.
వ్యవసాయ విద్యుత్ కనెక్షన్‌లకు మీటర్లు పెట్టాల్సిందేనని ముసాయిదా బిల్లులో ప్రస్తావించారన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్‌లకు మీటర్లు పెడుతున్న రాష్ట్రాలకు 0.5 శాతం అదనంగా ఎఫ్ఆర్‌బీఎం ఇస్తామంటున్నారని అగ్రహించారు.. ఏపీలో ఇప్పటికే కొన్ని వ్యవసాయ కనెక్షన్‌లకు మీటర్లు పెట్టారు.. కేంద్రం పెట్టమని చెప్పకుండానే జగన్ పెట్టారా? అని నిలదీశారు సీఎం కేసీఆర్.