బీఆర్ఎస్ పార్టీ ద్వారా దేశ రాజకీయాల్లోకి కేసిఆర్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. కేంద్రంలో కూడా చక్రం తిప్పాలనే దిశగా కేసిఆర్ ముందుకెళుతున్నారు. ఇక నిదానంగా బిఆర్‌ఎస్ పార్టీని అన్నీ రాష్ట్రాల్లో విస్తరిస్తూ వెళుతున్నారు. ప్రస్తుతం కర్నాటక, మహారాష్ట్ర, ఏపీ, ఒడిశా, తమిళనాడు లాంటి రాష్ట్రాలపై కేసిఆర్ ఫోకస్ పెట్టారు. తెలుగు ప్రజలు ఎక్కువ ఉన్న ప్రాంతాలపై ఫోకస్ పెట్టి రాజకీయం నడిపిస్తున్నారు. ఆయా రాష్ట్రాల్లో కొందరు నేతలని బిఆర్‌ఎస్లో చేర్చుకుంటూ వస్తున్నారు.
ఇదే క్రమంలో తాజాగా కేసీఆర్ మహారాష్ట్రపై ఫోకస్ పెట్టారు. అక్కడ భారీ సభ పెట్టి..అధికారంలో బీజేపీ టార్గెట్ గా విమర్శలు చేశారు. ‘అబ్‌కీ బార్ కిసాన్ సర్కార్’ నినాదంతో ముందుకెళుతున్న కేసీఆర్.. దేశంలో త్వరలో రైతుల తుపాన్ రాబోతోందని, దాన్నెవరూ ఆపలేరని అన్నారు.
ఈ క్రమంలోనే మహారాష్ట్ర మాజీ సీఎం, ప్రస్తుత డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌కు కేసీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మహారాష్ట్రకు తనను రావొద్దనడానికి మీరెవరు అంటూ ప్రశ్నించిన ఆయన, తెలంగాణ తరహా అభివృద్ధి చేస్తే మళ్లీ మహారాష్ట్ర రానని, దమ్ముంటే రైతు బంధు, దళిత బంధు, 24 గంటల కరెంట్, రైతు బీమా వంటి పథకాలు అమలు చేసి చూపించాలని సవాలు విసిరారు. మహారాష్ట్రలో పుట్టే కృష్ణా, గోదావరి నదులు ఉన్నా.. రైతులకు మేలు జరగటం లేదని అన్నారు.
బీఆర్ఎస్ పార్టీని మహారాష్ట్రలోనూ రిజిస్టర్ చేయించామని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తామని, ప్రతి జిల్లా పరిషత్‌పై గులాబీ జెండా ఎగరాలని పిలుపునిచ్చారు. మహారాష్ట్రపై కూడా కేసిఆర్ ఫోకస్ పెట్టారు. అయితే స్థానిక ఎన్నికల్లో బిఆర్‌ఎస్ ప్రభావం ఏ మేరకు ఉంటుంది? అంటే కొంతమేర ఉంటుందని చెప్పవచ్చు. అది కూడా తెలంగాణకు బోర్డర్లో ఉన్న ప్రాంతాలపై కాస్త ప్రభావం ఉంటుంది.అక్కడ బిఆర్‌ఎస్ ఎక్కువ ప్రభావం చూపలేదని చెప్పవచ్చు. ఇప్పటికే బిజేపి, కాంగ్రెస్, శివసేన, ఎన్‌సిపి లాంటి నాలుగు బలమైన పార్టీలు మహారాష్ట్రలో ఉన్నాయి కాబట్టి..వాటి మధ్య బిఆర్‌ఎస్ ప్రభావం చూపడం కష్టమే.