తెలంగాణ తల్లి గా ఉద్యమకాలంలో ఎంతో ఆరాధించిన టీఆర్ఎస్ ఆధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా తన క్యాబినెట్‌లో మాత్రం మహిళలకు స్థానం లేకుండానే పరిపాలించాడు. మహిళలు పురుషులతో సమానంగా ఉన్నారు. కానీ తెలంగాణ క్యాబినెట్‌లో మొదటి సారి ఒక్కమహిళ కూడా మంత్రిగా పనిచేయలేదు. ఇక కేసీఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చి రెండోసారి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన కూడా తన క్యాబినెట్‌లో మహిళలకు స్థానం ఇవ్వలేదు.
ఇలా కేసీఆర్ మహిళలకు స్థానం లేకుండానే పరిపాలన సాగిస్తుండటంతో రాష్ట్రవ్యాప్తంగా అనేక సార్లు నిరసనలు వ్యక్తం అయ్యాయి. గత అసెంబ్లీ సమావేశాల్లో కూడా మహిళా మంత్రి లేని పరిపాలనపై ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు గట్టిగా నిరసన తెలిపిస సందర్భాలు ఉన్నాయి. అయితే అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ఈసారి క్యాబినెట్ విస్తరణలో ఒక్క మహిళల కే కాదు ఇద్దరు మహిళలకు అవకాశం ఇస్తానని ప్రకటించారు. కానీ చాలా కాలంగా దాన్ని వాయిదా వేసుకుంటూ వస్తున్నారు.
ఇప్పుడు కేసీఆర్ రెండోసారి కేబీనేట్ విస్తరణ కార్యక్రమం చేపట్టడంతో ఇందులో ఎట్టకేలకు ఒకరు కాదు ఏకంగా ఇద్దరు మహిళలకు మంత్రి పదవులు కేటాయించి అందరికి షాక్ ఇచ్చారు. కేసీఆర్ అనుభవమే గీటురాయిగా కాంగ్రెస్ ఎమ్మెల్యేగా మహేశ్వరం నుంచి గెలిచిన పటోళ్ల సబితా ఇంద్రారెడ్డికి మంత్రిపదవి ఇచ్చారు. ఆమె ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటికి ఇటీవలే టీ ఆర్ ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇంతకు ముందు సబితా ఇంద్రారెడ్డి స్వర్గీయ వైఎస్ రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో కీలకమైన హోంశాఖామంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. చేవేళ్ళ చెల్లమ్మగా ముద్రపడిన సబితా ఇంద్రారెడ్డి ఇప్పుడు కేసీఆర్ కేబీనేట్‌లో మంత్రిగా పనిచేయన్నారు. ఇక విధేయతకు పట్టం కడుతూ కేసీఆర్ ఓ గిరిజన మహిళలకు మంత్రి పదవి ఇచ్చారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో డొర్నకల్ ఎమ్మెల్యేగా పనిచేసి, ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్న సత్యవతిరాథోడ్‌కు మంత్రిపదవి వరించింది. టీడీపీలో కేసీఆర్ తో కలిసి పనిచేసిన అనుభవం ఉండటంతో పాటుగా ఓ గిరిజన మహిళా ప్రతినిధిగా రాజకీయ అనుభవం దండిగా ఉంది. దీంతో పాటుగా తెలంగాణ ఉద్యమం కోసం టీడీపీని వదలి టీ ఆర్ ఎస్‌లో చేరి నిబద్దతతో పనిచేశారు సత్యవతి రాథోడ్. ఇప్పుడు మంత్రిగా కేసీఆర్ క్యాబినెట్‌లో స్థానం సంపాదించారు. ఏదేమైనప్పటికి రెడ్డి సామాజిక వర్గం నుంచి అనుభవమే గీటురాయిగా సబితా ఇంద్రారెడ్డికి, విధేయతకు పట్టం కడుతూ ఓ గిరిజన సామాజిక వర్గంకు చెందిన సత్యవతి రాథోడ్ మంత్రులుగా ఎంపిక కావడం, ఇదే సమయంలో తెలంగాణకు తొలి మహిళా గవర్నర్‌గా తమిళిసై రావడంతో తెలంగాణకు ఇప్పుడు మహిళలకు అధిక ప్రాధాన్యత సంతరించుకుంది.