నేడు మహబూబాబాద్‌, భద్రాద్రి జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన

-

ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు జిల్లాల పర్యటనకు వెళ్లనున్నారు. ఇవాళ మహబూబాబాద్‌, భద్రాద్రి జిల్లాల్లో కేసీఆర్ పర్యటించనున్నారు. 2 జిల్లాల్లో కలెక్టరేట్లు ప్రారంభించనున్నారు. అదే విధంగా రెండు జిల్లాల్లో బీఆర్ఎస్ కార్యాలయాలకు కూడా కేసీఆర్ శ్రీకారం చుట్టనున్నారు. సీఎం పర్యటనకు ఆయా జిల్లాల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

ప్రభుత్వశాఖలన్ని ఒకే చోట కొలువుదీరి ప్రజలకు పారదర్శక సేవలందించే లక్ష్యంతో అన్ని జిల్లాల్లో కొత్త సమీకృత కలెక్టరేట్లు రూపుదిద్దుకుంటున్నాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో కొత్తకలెక్టర్లేట్లు అందుబాటులోకి రాగా మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. 58కోట్లతో నిర్మించిన కలెక్టరేట్ సముదాయం అన్ని హంగులతో ముస్తాబైంది. ఇవాళ ఉదయం 11 గంటల పదినిమిషాలకు బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించి కేసీఆర్ ఆ తర్వాత కలెక్టరేట్‌కు చేరుకుంటారు. ఉదయం 11.40 నిమిషాలకు కేసీఆర్‌ కలెక్టరేట్‌ను ప్రారంభించాక ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.

మహబూబాబాద్‌ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో కేసీఆర్‌ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు వెళ్లి కొత్తగూడెం-పాల్వంచ జాతీయ రహదారి పక్కనే ఆధునిక హంగులతో నిర్మించిన కలెక్టరేట్‌ను ప్రారంభించనున్నారు. జిల్లా పాలనాధికారి దురిశెట్టి అనుదీప్‌ను కొత్త కలెక్టరేట్ ఛాంబర్‌లో కూర్చోబెడతారు. కలెక్టరేట్‌లోని గదులు అధికారుల ఛాంబర్లు పరిశీలిస్తారు. ఆ తర్వాత అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో.. కేసీఆర్ పాల్గొని ప్రసంగించనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version