దైవ భక్తి, యాగాలపై విశ్వాసం ఎక్కువగా ఉన్న తెరాస అధినేత కేసీఆర్ రాష్ట్ర ప్రజల కోసం మరో యాగానికి సిద్ధం అయ్యారు. ఎన్నికల కంటే ముందు రాజశ్యామల యాగాన్ని నిర్వహించిన కేసీఆర్ జనవరి 21 నుండి 25 వరకు ఎర్రవల్లిలో ఉన్న తన ఫాంహౌస్ లో రాష్ట్ర అభివృద్ధి కోసం ‘ మహారుద్ర సహిత సహస్ర చండీ మహా యాగం ‘ ను నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ మహా క్రతువును మాణిక్య సోమయాజి, నరేంద్ర కాప్రే, ఫణిశశాంక శర్మ, పురాణం మహేశ్వర శర్మ తదితరుల ఆధ్వర్యంలో ఈ యాగం చేపట్టనున్నారు.
ఇందుకుగాను మొత్తం 200 మంది రుత్విక్కులు ఈ యాగంలో పాల్గొననున్నారు. యాగ నిర్వహణకు సంబంధించి మాణిక్య సోమయాజితో శుక్రవారం కేసీఆర్ చర్చించినట్లు సమాచారం. ఈ మధ్య కాలంలో విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి ఆశీర్వచనం తీసుకున్నఆయన ఈ విషయంపై స్వామివారితో చర్చించినట్లు సమాచారం. పార్టీ స్థాపించిన తర్వాత, తెలంగాణ ఉద్యమ సమయంలోనూ కేసీఆర్ యాగాలను నిర్వహించిన విషయం తెలిసిందే.