ఆర్టీసీపై కేసీఆర్ సమీక్ష ప్రారంభం.. కీలక నిర్ణయంపై ఉత్కంఠ‌..

-

తెలంగాణ సీఎం కేసీఆర్ ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన డెడ్‌లైన్ మంగళవారం అర్థరాత్రితో ముగిసింది. దీంతో ఆర్టీసీ భవితవ్యంపై ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. డెడ్ లైన్ లోపు కార్మికులు విధుల్లో చేరకపోతే ఆర్టీసీ మొత్తం ప్రైవేటీకరణ తప్పదని శనివారం నాటి ప్రెస్ మీట్‌లో సీఎం హెచ్చరించిన సంగతి తెలిసిందే. అయితే ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి సమీక్ష నిర్వహిస్తున్నారు. బుధవారం మంత్రి పువ్వాడ అజయ్, ఆర్టీసీ ఉన్నతాధికారులతో ప్రగతి భవన్‌లో ఆయన సమావేశమయ్యారు.

ఇప్పటికే 5100 ప్రైవేట్ బస్సులను తీసుకొస్తున్నట్టు ప్రకటించిన సీఎం.. మిగతా సగాన్ని కూడా ప్రైవేటీకరించే అవకాశం కనిపిస్తోంది. మొత్తం 10,200 ప్రైవేట్ బస్సులకు సంబంధించి రూట్ మ్యాప్‌ను సిద్దం చేసినట్టు తెలుస్తోంది. మ‌రో వైపు ఆర్టీసీని ప్రైవేటీకరించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని ఆర్టీసీ జేఏసీ నేతలు వాదిస్తున్నారు. ఆర్టీసీలో 31శాతం కేంద్రం వాటా ఉందని గుర్తుచేస్తున్నారు. కాబట్టి కేంద్రం ఆమోదం లేకుండా ప్రైవేటీకరించడం సాధ్యం కాదన్నారు. ఏదేమైనా సీఎం కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారన్న దానిపై తెలంగాణ ప్రజలంతా ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news