తెలంగాణ మహిళలకు కేసీఆర్ సర్కార్ శుభవార్త చెప్పింది. పూల పండుగ సందర్భంగా తెలంగాణ ఆడబిడ్డలకు పంపిణీ చేసేందుకు బతుకమ్మ చీరలు సిద్ధమయ్యాయి. ఈ ఏడాది రూ. 340 కోట్ల వ్యయంతో, 30 రకాల రంగులు, 800 కలర్ కాంబినేషన్లు, 240 పై చిలుకు వెరైటీ డిజైన్లతో కోటి 18 లక్షల చీరలను ప్రభుత్వం తయారు చేయించింది.
ఈసారి చీరలకు వెండి, బంగారు జరి అంచులు ఉండటం విశేషం. బతుకమ్మ పండుగ ఉత్సవాలు ప్రపంచ పటంలో తెలంగాణ రాష్ట్ర ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలిచిన విషయం తెలిసిందే. ఎంతో ఉత్సాహంగా జరుపుకునే ఈ పండగకు మహిళలంతా కొత్త చీరలు ధరించాలని సీఎం కేసీఆర్ వారి కోసం ప్రతి ఏటా కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు.
సిరిసిల్ల, పోచంపల్లి, గద్వాల్ తదితర ప్రాంతాల్లోని నేతన్నలతో వీటిని తయారు చేయించి మహిళలకు ఉచితంగా ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. బతుకమ్మ సమీపిస్తుండటంతో 18 ఏండ్లు నిండిన ఆడపడుచులకు చీరలను పంపిణీ చేసేందుకు టెక్సో, తెలంగాణ హ్యాండ్లూమ్స్ శాఖ సన్నాహాలు చేస్తున్నది.