మునుగోడు ఉపఎన్నిక నోటిఫికేషన్ అక్టోబర్ మొదటి వారంలో వచ్చే అవకాశముందని రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. ఎన్నికలు నవంబర్లో జరగవచ్చని చెప్పారు. ఈ క్రమంలో ఉపఎన్నికకు సిద్ధంగా ఉండాలని నేతలకు సూచించారు. మునుగోడు ఉప ఎన్నికపై ప్రగతిభవన్‌లో ఉమ్మడి నల్గొండ జిల్లా నాయకులతో కేసీఆర్ సమీక్షించారు.
మునుగోడు నేతలు, ఉమ్మడి నల్గొండ జిల్లా నాయకులకు ఉపఎన్నికపై కేసీఆర్ మార్గనిర్దేశం చేశారు. ఎన్నిక ఇవాళో, రేపో అన్నట్లుగా శ్రమించాలని సూచించారు. ఊరూరా, ఇంటింటా ప్రచారం చేయాలని నేతలకు పిలుపునిచ్చారు. ప్రతి గడపకు వెళ్లి టీఆర్ఎస్ చేపట్టిన పథకాలు, వాటి వల్ల జరిగిన మేలును ప్రజలకు వివరించాలని చెప్పారు.
ముఖ్యంగా దళిత బంధుపై ఎక్కువగా ప్రచారం చేయాలని దానికోసం మునుగోడులో 500 మంది లబ్ధిదారులను ఎంపిక చేయాలని స్థానిక నేతలకు కేసీఆర్ సూచించారు. గిరిజన రిజర్వేషన్లను పది శాతానికి పెంచుతూ జీవో ఇవ్వనున్నామనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు. గిరిజన బంధునూ ప్రారంభించబోతున్నందున గిరిజనుల ఇంటింటికీ తిరిగి గిరిజన బంధు గురించి వివరించాలని తెలిపారు.