మంచిర్యాల జిల్లా దండపెల్లి మండలానికి చెందిన గుండ రవీందర్ అనే కార్యకర్త ఉద్యమం సమయంలో ఎంతో కృషి చేశారు. ముందు నుండి టిఆర్ఎస్ పార్టీలో ఉన్న ఆయన కేసీఆర్ పై గౌరవం తో ఆయనకు గుడి కట్టించి విగ్రహం ఏర్పాటు చేశారు. అందులో పూజలు కూడా చేసేవారు. అయితే మండలం లో మాత్రం ఆయనకు తగిన గుర్తింపు లభించలేదు. అంతే కాకుండా ఇటీవల ఆయనకు చెందిన కేబుల్ నెట్వర్క్ ను వేరేవాళ్ళు లక్కునట్టు తెలుస్తోంది. దాంతో రవీందర్ న్యాయం కోసం స్థానిక నాయకుల చుట్టూ తిరిగి ఎలాంటి ఉపయోగం లేకపోవడం తో ప్రగతి భవన్ చుట్టూ తిరిగారు.
కేటీఆర్ ,కేసీఆర్ ను కలవడానికి ఎన్నిసార్లు ప్రయత్నించినా కూడా ఫలితం లేకుండా పోయింది. దాంతో విసుగు వచ్చిన రవీందర్ తాను కట్టిన కేసీఆర్ గుడిని అమ్మకానికి పెట్టారు. ఫేస్ బుక్ లో కేసీఆర్ గుడి అమ్మబడును అంటూ పోస్ట్ పెట్టారు. ఒకవేళ ఎవరూ ఆ గుడి కొనకపోతే కూల్చేస్తాం అని రవీందర్ చెబుతున్నారు. ఇదిలా ఉంటే పార్టీ స్థాపించిన నాటి నుండి టిఆర్ఎస్ పార్టీలో తెలంగాణ ఉద్యమం లో పనిచేసిన వారికి తగిన స్థానం లభించలేదు అనే ఆరోపణలు ఎదురవుతూనే ఉన్నాయి. ఇక తాజాగా ఈ ఘటన తో మరోసారి అదే విషయం వెలుగులోకి వచ్చింది.