ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి భారీగా దెబ్బ తగిలిన జిల్లాల్లో కర్నూలు జిల్లా కూడా ఒకటి. రాజకీయంగా బలంగా ఉన్నామనుకున్న తరుణంలో అక్కడ గెలుస్తాం అనుకునే సీట్లను కూడా పార్టీ చేజార్చుకుంది. అందులో ప్రధానంగా… ఆళ్ళగడ్డ, నంద్యాల, పత్తికొండ వంటి నియోజకవర్గాలను కూడా పార్టీ చేజార్చుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. భూమా, కేయీ కుటుంబాలు ఇక్కడి నుంచి పోటీ చేసాయి. ఈ రెండు కుటుంబాలకు కూడా మంత్రి పదవులు ఇచ్చారు చంద్రబాబు… అయినా సరే పార్టీ ఓటమి పాలైంది..
జారిపోతున్న కేయీ కుటుంబం
ఓటమి నుంచి ఇప్పుడిప్పుడే బయటకువస్తున్న తెలుగుదేశం క్యాడర్ కి మరో షాక్ తగిలే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. జిల్లాలో బలమైన కుటుంబంగా ఉన్న కేయీ కుటుంబం పార్టీని వీడే అవకాశాలు కనపడుతున్నాయి. తాజాగా జగన్ రాజధాని విషయంలో చేసిన ప్రకటనను కేయీ కృష్ణ మూర్తి సమర్ధించారు. ఇక అక్కడి నుంచి ఆయన వైసీపీలో చేరే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వచ్చాయి. ఆయన కుమారుడు కేయీ శ్యాం బాబు, ఆయన సోదరుడు పార్టీ మారడానికి గాను,
ఇప్పటికే జిల్లాకు చెందిన ఒక కీలక నేతతో సంప్రదింపులు కూడా జరిపారని అంటున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే పార్టీలోకి వచ్చే అవకాశం ఉందని జనవరి మొదటి వారంలో లేదా మూడో వారంలో పార్టీ మారే అవకాశం ఉందని అంటున్నారు. వారితో మరికొందరు స్థానిక నేతలు కూడా పార్టీ మారే అవకాశం ఉందనే వ్యాఖ్యలు కూడా ఎక్కువగా వినపడుతున్నాయి. కేయీ కుటుంబానికి చంద్రబాబు కి మధ్య దశాబ్దాల అనుబంధం ఉంది. ఇద్దరు యువకులు గా ఉన్నప్పుడు మంత్రులుగా కాంగ్రెస్ లో పని చేసారు. అలాంటి కుటుంబం ఇప్పుడు పార్టీని వీడటం ఆందోళన కలిగిస్తుంది.