కేరళలోని త్రిక్కకర అనే ప్రాంతానికి చెందిన అబ్దుల్ కరీం ఓ నూతన తరహా స్టవ్‌ను రూపొందించి ఆకట్టుకున్నాడు. దానికి అతను రాకెట్ స్టవ్ అని పేరు పెట్టాడు. ఈ స్టవ్‌ను ఉపయోగించేందుకు ఎల్‌పీజీ లేదా విద్యుత్ అవసరం లేదు. వంట చెరకు, కొబ్బరికాయ చిప్పలు, వేస్ట్ పేపర్లు చాలు. అయితే వాటిని ఉపయోగిస్తే పొగ వస్తుంది కదా, దాంతో పర్యావరణానికి హాని కలుగుతుంది కదా.. అని ఎవరికైనా సందేహం కలగవచ్చు. కానీ నిజానికి ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకునే కరీం ఆ స్టవ్‌ను పర్యావరణ హితంగా తయారు చేశాడు. దీంతో ఇతర స్టవ్‌ల కన్నా అతని రాకెట్ స్టవ్ 80 శాతం తక్కువగా కర్బన ఉద్గారాలను విడుదల చేస్తుంది.
కాగా కరీం తక్కువ ఖరీదు కలిగిన మోటార్ పంప్‌లు, ఫర్నేస్‌లు, బాయిలర్స్, కిచెన్ సామగ్రిని తయారు చేసి విక్రయిస్తుంటాడు. కానీ కరోనా వల్ల అతనికి పనిలేకుండా పోయింది. దీంతో ఖాళీగా ఉండడం ఎందుకని అతను ఆ రాకెట్ స్టవ్‌ను తయారు చేశాడు. అందుకు గాను 1850లలో బ్రిటిష్ వారు ఉపయోగించిన స్టవ్ కాన్సెప్ట్‌ను అతను ఉపయోగించుకున్నాడు. ఇక లాక్‌డౌన్ సమయంలో కరీం ఆ స్టవ్‌ను అనేక మార్లు పరీక్షించి చివరికి ఆ డిజైన్‌ను ఫైనల్ చేశాడు.
ఇక ఆ స్టవ్ మీద అన్ని రకాల పాత్రలను పెట్టవచ్చు. ఈ స్టవ్‌కు గాను కరీం మొత్తం 3 మోడల్స్‌ను తయారు చేశాడు. హై ఎండ్ మోడల్ ధర రూ.14వేలు ఉండగా, బేసిక్ మోడల్ ధర రూ.4,500 ఉంది. ఇక మరో మోడల్‌లో గ్రిల్లింగ్, ఓవెన్, వాటర్ హీటింగ్ సదుపాయాలు ఉంటాయి. కానీ ఆ మోడల్‌ను ఇంకా విడుదల చేయలేదు. త్వరలో దాన్ని కూడా అతను మార్కెట్‌లోకి తేనున్నాడు. ప్రస్తుతం ఈ స్టవ్‌లను అతను కొన్నింటినే తయారు చేశాడు. త్వరలోనే పరిశ్రమ నెలకొల్పి వాటిని ఉత్పత్తి చేసి విక్రయించనున్నాడు.