కరోనా నేపథ్యంలో ప్రస్తుతం వైద్యులు భిన్న రకాల విధానాల్లో చికిత్స అందిస్తున్నారు. అయితే చికిత్స తీసుకునే వారు పౌష్టికాహారం తీసుకుంటే కరోనా నుంచి త్వరగా కోలుకునేందుకు అవకాశం ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీంతో సహజసిద్ధమైన చిట్కాలతో రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు కూడా యత్నిస్తున్నారు. అయితే కరోనా ఉందని చెప్పి అతనికి వైద్యులు నీటిని ఎక్కువగా తాగాలని చెబితే అతను చెప్పిన దాని కన్నా రెట్టింపు మొత్తంలో నీటిని తాగాడు. ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు.
బ్రిస్టల్ నగరంలోని ప్యాచ్ వేకు చెందిన 34 ఏళ్ల లూక్ అనే వ్యక్తికి కరోనా సోకింది. దీంతో అతను వైద్యులను కలిసి చికిత్స తీసుకోవడం మొదలు పెట్టాడు. వైద్యులు అతనికి ద్రవాహారం ఎక్కువగా తీసుకోమని, నీళ్లు బాగా తాగాలని సూచించారు. అయితే అతను రోజుకు రెండున్నర లీటర్ల నీళ్లను తాగాల్సిందిపోయి ఏకంగా 5 లీటర్ల నీటిని ఏకబిగిన తాగాడు. ఈ క్రమంలో అతను బాత్ రూంలో స్నానం చేస్తూ కుప్పకూలిపోయాడు.
కాగా లూక్ ను అతని కుటుంబ సభ్యులు హాస్పిటల్‌కు తరలించారు. అతను నీటిని ఎక్కువగా తాగడం వల్ల శరీరంలో ఉండే సోడియం మొత్తం బయటకు పోయిందని, దీంతో మెదడు వాపుకు గురైందని వైద్యులు తెలిపారు. ఈ క్రమంలో అతన్ని ప్రస్తుతం వైద్యులు ఐసీయూలో ఉంచి చికిత్సను అందిస్తున్నారు. అయితే మరో 24 నుంచి 48 గంటల వరకు ఏమీ చెప్పలేమని వైద్యులు తెలిపారు. అలా అతను వైద్యులు చెప్పిన దానికి మరీ అతి చేసి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు.