ఏనుగును చంపిన మానవమృగాల కోసం వేట.. ”మ్యాన్‌హంట్”‌ చేపట్టిన పోలీసులు..

-

కేరళలో అటవీ ప్రాంతం నుంచి ఆహారం కోసం బయటకు వచ్చిన గర్భంతో ఉన్న ఏనుగును అత్యంత కర్కషంగా చంపిన ఘటనలో బాధ్యులైన నిందితుల కోసం వేట మొదలు పెట్టారు. ఆ మానవమృగాలను వెదికిపట్టుకునేందుకు కేరళ ప్రభుత్వం మ్యాన్‌హంట్‌ పేరిట ప్రత్యేక ఆపరేషన్‌ చేపట్టింది. పోలీసులు ఇందులో భాగంగా ప్రస్తుతం ఆ ఘటనకు బాధ్యులైన నిందితులను గుర్తించి వారిని అరెస్టు చేసే పనిలో పడ్డారు.

కేరళలోని పాలక్కడ్‌ జిల్లాలో అటవీ ప్రాంతం నుంచి ఆహారం కోసం వచ్చిన ఓ గర్భంతో ఉన్న 15 ఏళ్ల వయస్సు గల ఏనుగుకు పలువురు సమీప గ్రామస్థులు బాణసంచా నిండిన పైనాపిల్‌ పండ్లను తినిపించారు. దీంతో ఏనుగు ఆ పండ్లను తినగానే దాని నోట్లో బాణసంచా పేలింది. ఈ క్రమంలో ఆ ఏనుగు సమీపంలో ఉన్న నది వద్దకు వెళ్లి తొండంతో నీళ్లను తాగే ప్రయత్నం చేసింది. కాలిన గాయాలతో విలవిలలాడుతూ కొన్ని గంటల చికిత్స అనంతరం అత్యంత బాధ, నొప్పితో మరణించింది. దీంతో యావత్‌ దేశం ఈ అమానుష ఘటనను ఖండించింది. ఇందుకు కారణమైన వారిని వెంటనే అరెస్టు చేయాలని నిరసనలు వెల్లువెత్తున్నాయి. దీంతో కేరళ ప్రభుత్వం స్పందించి నిందితులను వెంటనే పట్టుకోవాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.

కాగా ఆ ఏనుగు మరో 18 నుంచి 20 నెలల్లో మరో ఏనుగుకు జన్మనివ్వాల్సి ఉంది. కానీ ఇంతలోనే ఈ దారుణం చోటు చేసుకోవడం అందరినీ కలచివేసింది. దేశవ్యాప్తంగా ఉన్న జంతు ప్రేమికులు తీవ్రంగా స్పందించారు. జేఆర్డీ టాటా వంటి ప్రముఖులు కూడా ఈ ఘటన అత్యంత అమానుషమైందన్నారు. మరోవైపు బీజేపీ ఎంపీ, జంతు హక్కుల కార్యకర్త మేనకా గాంధీ.. కేరళ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. మళప్పురంలో తరచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నా ప్రభుత్వం చోద్యం చూస్తుందని ఆరోపించారు. వయనాడ్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ ఈ ఘటనపై ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నారో చెప్పాలని ఆమె డిమాండ్‌ చేశారు. కాగా కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌ ఈ ఘటనపై తమకు పూర్తి స్థాయి నివేదిక అందజేయాలని కేరళ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version