ఖైరతాబాద్ మహా గణపతి దర్శనానికి నగరంలోని భక్తజనం పెద్ద ఎత్తున పోటెత్తారు. వినాయకుడి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మహా గణపతి దర్శనానికి నేడు ఆఖరి రోజు కావడంతో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. వివిధ ప్రాంతాలనుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. మంగళవారం ఖైరతాబాద్ మహా గణపతి గంగమ్మ ఒడికి చేరనున్న నేపథ్యంలో ఈ రోజు భక్తులు పెద్ద ఎత్తున తరలుతున్నారు.
వినాయకచవితి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఖైరతాబాద్ మహా గణపతి విశేషంగా పూజలు అందుకున్నాడు. ఆదివారంతో భక్తుల సందర్శనకు గడువు ముగియనుంది. ఇదే విషయాన్ని ఉత్సవ కమిటీ సభ్యులు ముందస్తుగానే ప్రకటించారు. దీంతో భక్తులు గణేశుడిని ఆశీస్సుల కోసం ఖైరతాబాద్ వెళ్తున్నారు. దీంతో మెట్రో సర్వీసులు, బస్సులు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. వాహనదారుల రద్దీకి రోడ్లపై విపరీతంగా ట్రాఫిక్ జామ్ అవుతోంది.