ఖమ్మం టీఆర్ఎస్ లో ఐక్యత కష్టమేనా..మీటింగ్ మరునాడే మరో రచ్చ

-

ఖమ్మం జిల్లాలో ఉప్పు నిప్పుగా ఉన్న ఉన్న టీఆర్ఎస్ నేత విభేదాలకు చెక్ పెట్టే ఆలోచన చేసింది టీఆర్ఎస్ అధిష్టానం. అంతే వేగంగా టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ నాయకులతో సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు.ఇక అధికార పార్టీలో ఐక్యతకు తిరుగు లేదనుకున్నారు. కానీ మీటింగ్ జరిగిన మరునాడే సీన్ రివర్సయింది. సోషల్ మీడియా పోస్టులతో కొత్త చిచ్చు రేగింది.

ఎంతో ఊహించారు. ఇంకెదో జరుగుతుందని ఆశించారు. కానీ.. పంచాయితీ తెగలేదు. అధికార పార్టీలో కొత్త ప్రకంపనలు మొదలయ్యాయి. తాజాలను.. మాజీలను ఒకే గొడుకు కిందకు తీసుకొస్తారని..పార్టీలో సమస్యలన్నిటికి కేటీఆర్‌ సొల్యూషన్ ఇస్తారని దిగువస్థాయి నేతలు ఊహించారు. అయితే మిన్ను విరిగి మీద పడలేదు.. ఉన్న సమస్యలు ఇంచు కూడా కదలలేదు. ఇదే ఇప్పుడు ఖమ్మం జిల్లా టీఆర్‌ఎస్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది.

ఒకరిద్దరు ఎమ్మెల్యేలు ఎక్కువ చేస్తున్నారని.. పద్ధతి మార్చుకొని కలిసి పనిచేయాలని వార్నింగ్‌ ఇచ్చారట కేటీఆర్‌. ఇదే సమయంలో పార్టీ అధిష్ఠానం సైతం ఐక్యత సాధించలేక పోయిందనే చర్చ జరుగుతోంది. సమావేశానికంటే ముందే మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వచ్చి కేటీఆర్‌ను వ్యక్తిగతంగా కలిసి వెళ్లిపోయారట. దీంతో తమ్మల ముందే ఎందుకు వచ్చారు.. సమావేశంలో ఎందుకు పాల్గొనలేదని పార్టీ వర్గాలు ఆరా తీస్తున్నాయట.

ఇక ఇంతకాలం పార్టీ పట్టించుకోలేదు.. ఇప్పుడు మాత్రమే అవసరమైందా అన్నట్టు ఏకంగా సమావేశానికి డుమ్మా కొట్టారు కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు. జిల్లాలో పార్టీకి మొదట పునాది వేసిన తనపట్ల టీఆర్‌ఎస్‌ పెద్దల వైఖరి సరిగా లేదన్న ఆగ్రహంతో ఆయన ఉన్నారట. అందుకే సమావేశం వైపు కనీసం తొంగి చూడలేదట జలగం. దీనికితోడు వారం రోజులుగా జిల్లా టీఆర్‌ఎస్‌లో రాజకీయ పరిణామాలు ఆ పార్టీ భవిష్యత్‌ను గందరగోళంలో పడేసేలా ఉన్నాయట.

మొన్నటికి మొన్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. సొంత పార్టీ నేతలపై పరోక్షంగా తీవ్రంగా విమర్శలు చేశారు. ఎమ్మెల్యే సండ్ర వర్సెస్‌ పొంగులేటి వార్ నడిచింది. దీనిపై కేటీఆర్ భేటీలోనూ చర్చ జరిగిందట..ఇదే సమయంలో కేటీఆర్‌తో జరిగిన భేటీలో సోషల్‌ మీడియాలో వస్తున్న పోస్టింగ్‌లపై సండ్ర వీరయ్య భగ్గుమన్నారు. పొంగులేటి వర్గాన్ని నేరుగా ప్రస్తావించకుండానే ఆయన ఘాటైన విమర్శలు చేశారు. అంతర్గతంగా జరిగిన సమావేశంపై సోషల్ మీడియా కామెంట్స్ మరో కొత్త రచ్చని రాజేశాయట…

సమావేశం ముగిసిన మరుసటిరోజే ఇలాంటి ప్రకంపనలు రావడంతో.. అసంతృప్తుల స్వరం ఇంకా పెరుగుతుందేమోనని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారట. అసలే ఎమ్మెల్సీ ఎన్నికలు..ఆపై ఖమ్మం మున్సిపల్‌ ఎన్నికల వేళ అధికార పార్టీ అంతర్గత పోరు ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version