పొలిటిక‌ల్ పొలికేక : సింహానికి పోటీగా శివంగి.. రామ‌య్యా గెట్ రెడీ!

-

ఇద్ద‌రు దిగ్గ‌జ రాజ‌కీయ ప్ర‌తినిధులు
వేర్వేరు పార్టీలు అయినా ఒకే ప్రాంతం
ఒక‌రు యువ ఎంపీ రాము
మ‌రొక‌రు కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి
త్వ‌ర‌లో రాజ్య‌స‌భ ఎంపీ కానున్నారు.
దేశ రాజ‌ధానిలో ఈ ఇద్ద‌రూ మా ఉత్త‌రాంధ్ర ప్రాంతం
మా శ్రీ‌కాకుళం త‌ర‌ఫున పార్ల‌మెంట్ లో శ‌క్తివంచ‌న లేకుండా
పోరాడాల‌ని కోరుకుందాం..

వ‌చ్చే జూన్ లో జ‌రిగే రాజ్య‌స‌భ ఎన్నిక‌ల‌లో భాగంగా నాలుగు సీట్లు వైసీపీకి ద‌క్క‌నున్నాయి. ఇందులో ఒక‌టి శ్రీ‌కాకుళం జిల్లాకు చెందిన మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణిని వ‌రించ‌నుంది. ఉత్త‌రాంధ్ర బీసీ నేత‌గా ఉన్న ఆమెకు ఎప్ప‌టి నుంచో స‌ముచిత స్థానం ఇవ్వాల‌ని జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి భావిస్తున్నారు. ఇందులో భాగంగా ఆమెకు సీటును క‌న్ఫం చేశారు. పెద్ద‌ల స‌భ‌కు పంపడం ద్వారా మ‌రో మ‌హిళా నాయ‌క‌త్వాన్ని స‌మ‌ర్థించిన వాడిని అవుతాన‌ని సీఎం భావిస్తున్నారు.

అంతేకాకుండా మొద‌ట్నుంచి పార్టీ సిద్ధాంత ప‌రంగా కూడా మ‌హిళ‌ల‌కు స‌ముచిత స్థానం ఇవ్వాల‌న్న‌ది త‌న భావన అని ఆయ‌న చెబుతూ వ‌స్తున్నారు. ఆ మాట‌ల‌కు కొనసాగింపుగా, ఆచ‌ర‌ణ రూపం ఇస్తూ కిల్లి కృపారాణికి పెద్ద‌ల స‌భ‌లో చోటు ఇవ్వాల‌ని, త‌ద్వారా ఆమెను గౌరవించుకోవాల‌ని అధిష్టానం నిర్ణ‌యించింది. గ‌తంలో హ‌స్తిన పురి రాజ‌కీయాల్లో ఆమె క్రియాశీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు. ఆ రోజు కేంద్ర మంత్రి (టెలికాం, క‌మ్యునికేష‌న్ల శాఖకు స‌హాయ మంత్రి)గా ప‌నిచేసి రాణించారు. స‌మ‌ర్థ‌తకు చిరునామాగా నిలిచి ఉత్త‌రాంధ్ర‌కు మంచి పేరు తెచ్చుకున్నారు.

ఉద్దండ రాజ‌కీయ నాయ‌కుల మ‌ధ్య పార్ల‌మెంట్ వేదిక‌గా త‌న గొంతుక వినిపించి దేశ రాజ‌కీయాల్లో త‌న‌దైన ముద్ర వేశారు. మ‌ళ్లీ ఇన్నాళ్ల‌కు ఆమె ఢిల్లీ కేంద్రంగా త‌న గొంతుక వినిపించ‌డంలోనూ, విప‌క్ష స‌భ్యుల వ్యాఖ్య‌ల‌కు చెక్ పెట్ట‌డం అన్న‌ది చేయ‌నున్నారు.అన్నీస‌జావుగా సాగితే ఆమె ఎన్నిక లాంఛ‌న‌మే!

ఇక టీడీపీ త‌ర‌ఫున శ్రీ‌కాకుళం యువ ఎంపీ కింజ‌రాపు రామ్మోహ‌న్ నాయుడు త‌న‌దైన వాగ్ధార‌తో దేశ రాజ‌ధానిలో దూసుకుపోతున్నారు. పార్ల‌మెంట్ లో రాష్ట్ర స‌మ‌స్య‌లపై తీవ్ర స్థాయిలో స్వ‌రం వినిపించి, ప‌రిష్కారంలో తాత్సారం చేస్తున్న కేంద్రాన్ని నిల‌దీస్తున్నారు. ముఖ్యంగా ఆయ‌న వాగ్ధార‌కు ఎంద‌రో అభిమానులు ఉన్నారు. ఇప్ప‌టికే ప్ర‌త్యేక హోదా, ప్ర‌త్యేక జోన్ (రైల్వేల‌కు సంబంధించి) త‌దిత‌ర కీల‌క అంశాల‌పై పార్ల‌మెంట్ లో అనేక సార్లు మాట్లాడారు.

ఇప్పుడు అక్క‌డికి వైసీపీ త‌ర‌ఫున కృపారాణి వెళ్ల‌నున్నారు.ఆమె ఎలా మాట్లాడ‌నున్నారో సిక్కోలు సింహంతో శివంగి ఏ విధంగా త‌ల‌ప‌డనున్నారో అన్న‌ది ఆస‌క్తిదాయకం. వ్య‌క్తిగ‌తంగా వైసీపీ నాయ‌కులంద‌రికీ ఎంపీ రామూ అంటే ఎంతో ఇష్టం. ఆ ఇష్టాన్ని ఎన్నోసార్లు వ్య‌క్తం చేశారు కూడా! సైద్ధాంతిక విభేదం త‌ప్ప రాము తమ ఇంటి బిడ్డ అనే భావ‌న‌తో ఉంటారు శ్రీ‌కాకుళం జిల్లా నాయ‌కులంతా! ఈ క్ర‌మంలో ఉత్త‌రాంధ్ర ప్రాధాన్యాల‌ను గుర్తించి అభివృద్ధికి సంబంధించి రాష్ట్రానికి నిధులు తీసుకుని రావ‌డ‌మే కాక జిల్లా స‌మ‌స్య‌ల ప‌రిష్కారార్థం కూడా ఈ ఇద్ద‌రూ ఒక‌రి క‌న్నా మిన్న మ‌రొక‌రు అన్న విధంగా కృషి చేసి అనుకున్న‌వ‌న్నీ సాధించుకుని రావాల‌ని ఆకాంక్షిద్దాం. ఆల్ ద బెస్ట్ మేడ‌మ్.. ఆల్ ద బెస్ట్ రామూ స‌ర్…

– ర‌త్న‌కిశోర్ శంభుమ‌హంతి, శ్రీ‌కాకుళం దారుల నుంచి

– పొలిటిక‌ల్ పొలికేక, మ‌న లోకం ప్ర‌త్యేకం

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version