బాబుకి చెక్ పెట్టేందుకు కేంద్రం వ్యూహం..

-

ఏపీ సీఎం చంద్రబాబునాయుడికి చెక్ పెట్టేందుకు కేంద్ర గవర్నర్ రూపంలో ఆస్త్రాన్ని సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. సీఎం చంద్రబాబు జాతీయ రాజకీయాలపై దృష్టి సారిస్తూ, భాజపా సర్కార్‌ను ఇరుకున పెట్టేలా వ్యవహరిస్తుండటంతో.. సీరియస్ గా ఉన్న కమలం నేతలు… ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన గవర్నర్‌గా కిరణ్ బేడీని నియమించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.  ఈ విషయమై కొద్ది రోజులుగా సామాజిక మాధ్యామల్లోనూ చర్చ కొనసాగుతోంది. ప్రస్తుతం పుదుచ్చేరి గవర్నర్‌గా ఉన్న కిరణ్ బేడీకి ఏపీ గవర్నర్‌ బాధ్యతలు అప్పగించడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

భారత్‌లో తొలి మహిళా ఐపీఎస్‌గా గుర్తింపు పొందిన కిరణ్ బేడీకి భాజపా ప్రభుత్వం సముచిత గౌరవం ఇచ్చింది. అయితే ఇప్పటికే పుదుచ్చేరిలో కాంగ్రెస్ ప్రభుత్వానికీ కిరణ్ బేడీకి మధ్య సయోధ్య కుదరకపోవడంతో  ఆమెను తొలగించాలని ముఖ్యమంత్రి నారాయణ స్వామి చాలాసార్లు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఒక వేళ అదే జరిగితే ఏపీలో పాలనా పరమైన అంశాల్లో తెదేపా ప్రభుత్వానికి కాస్త ఇబ్బందులు  తప్పవని రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్ గా ఉన్న నరసింహన్ పై పలు మార్లు సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయనతో పాటు పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులు సైతం గవర్నర్ పై ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో ఏపీకి కూడా ప్రత్యేక గవర్నర్ ఉండాలనే డిమాండ్ పెరిగింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే విషయమై అందరు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఏపీలో గవర్నర్ నియామకం గురించి అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు..దీంతో సోషల్ మీడియాలో వస్తున్న పూకార్లకు త్వరలోనే సమాధానం రానుంది. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వార్తలో ఎంత నిజముందో అనేది వేచి చూడాల్సిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version