ఐపీఎస్ గ‌వ‌ర్న‌రమ్మ తీరు మార‌లేదు.. ఆద‌ర్శం బుట్ట‌దాఖ‌లేనా..?

-

ఆమె ఈ దేశానికి తొలి ఐపీఎస్ అధికారి. అప్ప‌టి వ‌ర‌కు పురుషులు మాత్ర‌మే పోలీస్ ఉన్న‌తాదికారులుగా చ‌క్రం తిప్పుతున్న రోజుల్లో ఈ దేశానికి అందిన పోలీస్ మ‌హిళా ఆణిముత్యంగా ఆమె పేరు తెచ్చుకున్నారు. దేశ విదేశాల్లోనూ ఆమె పేరు తెచ్చుకున్నారు. పెద్ద ప‌ద‌విలో ఉన్నా.. నిగ‌ర్వి, నిరాడంబ‌ర‌త ఆమెకు స‌హ జంగా అబ్బిన ల‌క్ష‌ణాలు. ఏ చిన్న సామాన్యుడు సాయం కోసం ఏ అర్ధ‌రాత్రి వ‌చ్చినా.. ఆమె ఇంటి త‌లుపు లు, ఆఫీస్ డోర్లు తెరిచే ఉంచి ఈ దేశంలోని అనేక మంది అధికారుల‌కు ఆద‌ర్శంగా నిలిచారు. విధుల్లో అత్యంత నిజాయితీ, చేసే ప‌నిప‌ట్ల అత్యంత అంకిత భావం ఆమెకు స్వ‌త‌హాగా ల‌భించిన కీర్తి కిరీటాలు.

అలాంటి ఐపీఎస్ అధికారే కిర‌ణ్ బేడీ. సుదీర్ఘ త‌న ఉద్యోగ ప్ర‌స్థానంలో ఆమె సాహ‌సించి సాధించిన అనేక విజ‌యాలు ఉన్నాయి. అదేస‌మ‌యంలో నిష్క‌ర్ష‌, రాజ‌కీయాలతో జోక్యం లేకుండా ఆమె సాధించిన ప్ర‌గ‌తి కూడా నిరుప‌మానం. ఈ క్ర‌మంలోనే త‌న‌క‌న్నాజూనియ‌ర్ అధికారిని ఢిల్లీ డీజీపీగా నియ‌మించ‌డంతో అ సంతృప్తికి లోనైన ఆమె.. తృణ‌ప్రాయంగా త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. ఈ క్ర‌మంలోనే ఆమె బీజేపీకి చేర‌వ‌య్యారు. ఈ క్ర‌మంలోనే ఆమెను పుదుచ్చేరి గ‌వ‌ర్న‌ర్‌గా నియ‌మించారు. అయితే, ఆమె ఇక్క‌డ త‌న దూకుడు పెంచారు. అయిన దానికీ, కాని దానికీ .. త‌న అధికారాన్ని వినియోగించ‌డంతో ఒక‌ర‌కంగా ప్ర‌జ‌ల నుంచి వ్య‌తిరేకత పెంచుకుంటున్నార‌నేది వాస్త‌వం.

రాజ్యాంగ బ‌ద్ధ ప‌ద‌విలో ఉన్న వ్య‌క్తి చాలా ఆచితూచి వ్య‌వ‌హ‌రించాలి. పైగా ఆమె ఉన్న‌త చ‌దువు అభ్య‌సించి, ఉన్న‌త స్థాయి నుంచి వ‌చ్చిన వ్య‌క్తి, అయినా కూడా ఆమె గ‌వ‌ర్న‌ర్‌గా వేస్తున్న అడుగులు ఆ ప‌ద‌వికి కొంత డ్యామేజీ వ‌చ్చేలా ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ని సోష‌ల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. రాజ‌కీయాల‌కు అతీతంగా వ్య‌వ‌హ‌రించి ఐపీఎస్గా మంచి పేరు తెచ్చుకున్న బేడీ.. ఇప్పుడు ఫ‌క్తు రాజీకీయ అజెండాతో ముందుకు సాగుతున్నార‌నే పేరు తెచ్చుకుంటున్నారు. హెల్మెట్‌ ధరించకుండా స్కూటర్‌ నడిపిన పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామి తప్పకుండా జరిమానా చెల్లించాల్సిందేనని లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కిరణ్‌బేదీ పేర్కొన్నారు.

పుదుచ్చేరిలోని కామరాజనగర్‌ ఉప ఎన్నికల చివరి రోజు ప్రచారంలో భాగంగా కాంగ్రెస్‌ కార్యకర్తలు నిర్వహించిన ర్యాలీలో నారాయణస్వామి హెల్మెట్‌ ధరించకుండా హోండా స్కూటర్‌ నడిపారు. ఆ ఫొటో ప్రసార మాధ్యమాల్లో వచ్చింది. ఈ నేపథ్యంలో మోటారు వాహనాల చట్టాన్ని ఉల్లఘించి హెల్మెట్‌ ధరించకుండా స్కూటర్‌ నడిపిన ముఖ్యమంత్రి నారాయణస్వామిపై కేసు నమోదు చేసి, జరిమానా వసూలు చేయాలంటూ గవర్నర్‌ కిరణ్‌బేదీ ఆ రాష్ట్ర డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు.

దీంతో ఆగ్రహించిన ముఖ్య మంత్రి నారాయణస్వామి గతంలో జ‌రిగిన సంఘ‌ట‌న‌ను తెర‌మీదికి తెచ్చారు. హెల్మెట్‌ ధరించకుండా ఓ స్కూటర్‌ వెనుక సీటులో ప్రయాణిస్తున్న కిరణ్‌బేదీ ఫొటోను సామాజిక ప్రసార మాధ్యమాల్లో పెట్టి, ఒకరికి సలహా చెప్పేటప్పుడు తాను దానిని పాటించానో లేదో గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత ఆమెకు ఉందని కౌంటర్‌ ఇచ్చారు. ఈ నేపథ్యంలో నారాయణస్వామి కౌంటర్‌కు మంగళవారం ఉదయం కిరణ్‌బేదీ రీ-కౌంటర్‌ ఇస్తూ, సీఎం విడుదల చేసిన ఫొటోలో తాను మోటారు వాహన చట్టం ఉల్లఘించలేదని స్పష్టమవుతోందని, వాస్తవానికి తాను స్కూటర్‌ను నడుపలేదని, ఓ ఉద్యోగి నడుపుతున్న స్కూటర్‌ వెనుక సీటులో కూర్చుని ప్రయాణించానని స్పష్టం చేశారు.

ఇలాంటి చిన్న విష‌యాల‌ను గ‌వ‌ర్న‌ర్ చూసీ చూడ‌న‌ట్టు వ్య‌వ‌హ‌రించాలి. ఇలాంటి విష‌యాల్లో సంబంధిత‌ అధికారులు చ‌ర్య‌లు తీసుకుంటారు. కానీ, గ‌వ‌ర్న‌ర్ ఇలాంటి విష‌యాల్లో వేలు పెట్టి చెడ్డ‌పేరు తెచ్చుకుంటున్నార‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. మ‌రి ఐపీఎస్ గ‌వ‌ర్న‌ర‌మ్మ మార‌తారా?  లేక ముక్కుసూటిగానే ఉంటారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news