డయాబెటిస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఏటా సుమారుగా 16 లక్షల మంది చనిపోతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలు చెబుతున్నాయి. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరగడం వల్ల ఈ వ్యాధి వస్తుంది. దీన్ని టైప్ 2 డయాబెటిస్ అంటారు. దీన్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తే గుండె జబ్బులు వస్తాయి. కిడ్నీలు పాడవుతాయి. చూపు దెబ్బ తినే అవకాశం ఉంటుంది. కనుక డయాబెటిస్ ఉందని తెలియగానే దాన్ని అదుపులో ఉంచుకునే పనిచేయాలి. ఇక ఇందుకు వేపాకులు అద్భుతంగా పనిచేస్తాయని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు.
వేపాకుల్లో ఉన్న ఔషధ గుణాలు రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తాయని ఇండియన్ జర్నల్ ఆఫ్ ఫిజియాలజీ అండ్ ఫార్మకాలజీలో ప్రచురించారు. వేపాకుల్లో విటమిన్ ఎ, బి, సి, కాల్షియం, ఐరన్, ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. అందువల్ల డయాబెటిస్ ఉన్న వారు నిత్యం వేపాకులను తీసుకోవాలని న్యూట్రిషనిస్టులు సూచిస్తున్నారు. నిత్యం ఉదయాన్నే పరగడుపునే 4 వేపాకులను అలాగే నమిలి తింటే ప్రయోజనం ఉంటుందని అంటున్నారు.
వేపాకుల్లో ఉండే విటమిన్ ఎ, సిలు పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్లలా పనిచేస్తాయి. ఇవి షుగర్ లెవల్స్‌ను అదుపు చేస్తాయి. డయాబెటిస్ ఉన్నవారు శరీరంలోని మినరల్స్‌ను త్వరగా కోల్పోతారు. దీంతో ఎముకలు బలహీరంగా మారుతాయి. దీన్ని నివారించేందుకు వేపాకుల్లో ఉండే కాల్షియం తోడ్పడుతుంది. అలాగే డయాబెటిస్ ఉన్నవారికి రక్తహీనత వస్తుంటుంది. దీనికి వేపాకుల్లో ఉండే ఐరన్ పనిచేస్తుంది. ఇక వేపాకుల్లో ఉండే ఫ్లేవనాయిడ్స్ రక్తంలోని షుగర్ లెవల్స్ ను తగ్గిస్తాయి. శరీరం ఇన్సులిన్‌ను ఎక్కువగా ఉపయోగించుకునేలా చేస్తాయి. దీంతో షుగర్ లెవల్స్ తగ్గుతాయి. డయాబెటిస్ అదుపులో ఉంటుంది. కనుక డయాబెటిస్ ఉన్నవారు వేపాకులను నిత్యం తీసుకుంటే ఫలితం ఉంటుంది.