ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ తనయుడు కోడెల శివరామ్ ఈరోజు నరసరావుపేట మొదటి అదనపు మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టులో లొంగిపోయారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కోడెల, ఆయన కుటుంబంపై కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే. ఇక కోడెల శివరామ్ కె ట్యాక్స్ పేరిట భారీగా వసూళ్లకు పాల్పడ్డారని కోడెల శివరామ్ పై ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో ఆయనపై వివిధ పోలీసు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఐదు కేసుల విషయమై తనకు బెయిల్ ఇవ్వాల్సిందిగా కోడెల శివరాం హైకోర్టును ఆశ్రయించారు.
ఆయన అభ్యర్థనపై స్పందించిన హైకోర్టు.. శివరాంను స్థానిక కోర్టులో లొంగిపోయి బెయిల్ పొందవచ్చని హైకోర్టు సూచించడంతో కోడెల శివరామ్ నరసరావు పేట కోర్టులో లొంగిపోయారు. మరికొద్ది సేపటిలో బెయిల్ ద్వారా బయటకు రానున్నారు. కాగా కే ట్యాక్స్ పేరిట భారీ ఎత్తున ప్రజలు కోడెల కుటుంబంపై ఫిర్యాదు చేయడం, సొంత పార్టీ నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత, పార్టీ అధిష్టానం సైతం తనను పట్టించుకోకపోవడం వంటి పరిణామాల నేపథ్యంలో కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే.