తెలంగాణ కోసం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంత్రి పదవిని కూడా వదులుకున్నారని గుర్తు చేశారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఇవాళ ఎస్ఎల్బీసీ మోసంబీ మార్కెట్ యార్డులో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు సంక్షేమమే మా ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యం అన్నారు.
మరోవైపు రైతు భరోసా పై రైతులకు గుడ్ న్యూస్ చెప్పారు మంత్రి తుమ్మల. త్వరలోనే రైతు భరోసా నిధులు రూ.7,500 ఎకరానికి ఏడాదికి రూ.15వేలు ఇస్తామన్నారు. ఈ నెలాఖరు వరకు రూ.2లక్షల లోపు ఉన్న రైతులకు రుణమాఫీ పూర్తి చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. వచ్చే నెల నుంచి రూ.2లక్షల పైబడి ఉన్న వారికి రుణమాఫీ చేస్తామని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చిందని దుయ్యబట్టారు. నల్గొండ జిల్లా అభివృద్ది చెందడంలో మంత్రి కోమటిరెడ్డి పాత్ర ఎంతో ఉందన్నారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రజల మనిషని.. తెలంగాణ కోసం మంత్రి పదవీనే త్యాగం చేశారని ప్రశంసించారు. నల్గొండ జిల్లా ప్రజలకు నీళ్లు ఇస్తే.. చాలు సిరులు పండిస్తారన్నారు.