టీపీసీసీ అధ్యక్ష పదవి తనను వరించక పోవడంతో కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి komatireddy venkatreddy తీవ్ర అసహానానికి గురైన విషయం తెల్సిందే. రేవంత్‌రెడ్డిని టీపీసీసీ చీఫ్ గా నియమించడంపై కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో సంచలనం సృష్టించాయి. టీపీసీసీ…టీడీపీ పీసీసీగా మారిందని, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ అమ్ముడు పోయారని, ఓటుకు నోటు మాదిరిగా.. నోటుకు పీసీసీ మారిందంటూ వ్యాఖ్యలు చేసారు.
అయితే తన వ్యాఖ్యలపై కోమటిరెడ్డి నేడు వివరణ ఇచ్చారు. వైఎస్‌ఆర్ జయంతి సందర్భంగా భువనగిరిలో వైఎస్‌ఆర్ విగ్రహానికి నివాళులు అర్పించిన అనంతరం కోమటిరెడ్డి మాట్లాడుతూ… తనకు పీసీసీ పదవి రాలేదన్న ఆవేదనతోనే అలా మాట్లాడాని చెప్పుకొచ్చారు. అన్ని అర్హతలు ఉండి పదవి ఇవ్వకుంటే బాధ ఉంటుందని అన్నారు.
తనకు చాలా పార్టీల నుంచి ఆహ్వానాలు అందాయని తెలిపిన కోమటిరెడ్డి… ఏ పార్టీలో చేరనని, కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని తేల్చి చెప్పారు. పార్టీలో గ్రూపు రాజకీయాలు చేస్తే అందరం నష్టపోతామన్నారు. కేసీఆర్‌ను ఓడించాలంటే అందరం కలిసికట్టుగా పని చేయాలన్నారు. కాగా అంతకుముందు కోమటిరెడ్డి నూతన పార్టీ స్థాపిస్తున్న వైయస్ షర్మిలకు శుభాకాంక్షలు తెలిపారు. షర్మిల పార్టీ సభ జరగనున్న జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ వద్దకు వెళ్లి వైఎస్సార్ అభిమానులతో ఆయన ముచ్చటించారు.