కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఏడాది తర్వాత గాంధీభవన్‌లో అడుగుపెట్టారు. టీకాంగ్రెస్ నేతలతో పార్టీ రాష్ట్ర ఇంఛార్జ్ మాణిక్ రావు థాక్రే సమావేశమైన తరుణంలో కోమటిరెడ్డి వచ్చారు. థాక్రేతో సమావేశమయ్యారు. రేవంత్‌రెడ్డితో కోమటిరెడ్డి కొద్దిసేపు మాట్లాడారు. తానెప్పుడు గాంధీభవన్‌కు రానని చెప్పలేదని.. నియోజకవర్గ అభివృద్ధి పనుల్లో బిజీగా ఉండటం వల్ల ఇక్కడకు రాలేదని కోమటిరెడ్డి తెలిపారు. గాంధీ భవన్‌తో తనకు 30 ఏళ్ల అనుబంధం వుందన్నారు. 26 నుంచి జరిగే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో అధికారంలోకి ఎలా రావాలి అనే అంశంపై చర్చిస్తామని ఆయన స్పష్టం చేశారు.
ఇకపోతే.. ఎఐసీసీ ఇచ్చిన షోకాజ్ నోటీసులు చెత్లబుట్టలో పడ్డాయని కొద్దిరోజుల క్రితం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి.షోకాజ్ నోటీస్ అనేది లేనే లేదన్నారు . గాంధీభవన్ కు ఇతర నేతలు కూడా రాలేదని ఆయ న చెప్పారు. పీసీసీ కమిటీలను తాను పట్టించుకోనన్నారు.నాలుగైదు సార్లు ఓటమిపాలైనవారితో తాను కూర్చోవాలా అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రశ్నించారు. ఎన్నికలు వస్తున్నందున ప్రజల్లోకి వెళ్లి యుద్ధం చేయాలన్నారు.ఈ విషయమై ఠాక్రే కొన్ని సలహాలు చెప్పారన్నారు. తాను కూడా కొన్ని అంశాలను మాణిక్ రావుకు చెప్పినట్టుగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వివరించారు. తన గురించి ఠాక్రేకు తెలుసునన్నారు.