తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సంచలనంగా మారిన ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి..తాజాగా ఏఐసిసి అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గేని కలిసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ లో ఏ పదవి దక్కకపోవడంతో…ఖర్గే..కోమటిరెడ్డికి పదవి ఇస్తానని హామీ ఇచ్చారు. అయితే కోమటిరెడ్డి కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఇదే సమయంలో తాజాగా ప్రధాని మోదీతో కోమటిరెడ్డి భేటీ అయ్యారు.
కాకపోతే రాజకీయ పరమైన అంశాలు కాకుండా..అభివృద్ధి పరమైన అంశాలనే చర్చించామని కోమటిరెడ్డి చెబుతున్నారు. మూసీ ప్రక్షాళనపై, హైదరాబాద్-విజయవాడ 6 లైన్ల హైవేపై మాట్లాడానని, హైవేను విస్తరించాలని ప్రధానిని కోరానని, ఎంఎంటీఎస్ ట్రైన్‌ను యాదాద్రి వరకు పొడిగించాలని కోరానని చెప్పుకొచ్చారు.
మూసీ ప్రక్షాళన కోసం అవసరమైతే సీఎం కేసీఆర్‌ను కలుస్తానని, ప్రస్తుతం తాను కాంగ్రెస్‌లోని ఏ కమిటీలో సభ్యుడిగా లేనని చెప్పారు. ఎన్నికలకు ముందు రాజకీయాల గురించి మాట్లాడతానని, ఎంపీగా పోటీ చేస్తానా..? ఎమ్మెల్యేగా పోటీ చేస్తానా? అనేది త్వరలోనే చెబుతానని అన్నారు. అయితే అంతా క్లారిటీ గానే చెబుతున్నారు గాని..ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారో మాత్రం క్లారిటీ ఇవ్వట్లేదు.
ప్రస్తుతానికి ఆయన కాంగ్రెస్ పార్టీతో అంటీముట్టనట్లుగా ఉన్నారు. కాంగ్రెస్ ఏమో కోమటిరెడ్డిని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపించడం లేదు. కానీ ఆయన కాంగ్రెస్ పార్టీని వదిలేలా కనిపిస్తున్నారు. ఎందుకంటే సీఎంలకే ప్రధాని మోదీ అపాయింట్‌మెంట్ దొరకడం కష్టమవుతుంది..అటు విపక్ష ఎంపీలకు సైతం కష్టమే. అలాంటిది కోమటిరెడ్డికి ఇప్పటికే పలుమార్లు మోదీ అపాయింట్‌మెంట్ దొరికింది. అది కూడా పర్సనల్‌గా మాట్లాడుకునే పరిస్తితి.
అంటే బీజేపీతో కోమటిరెడ్డి బంధం ఉందనే విషయం అర్ధమవుతుంది. ఆయన ఎన్నికల ముందు బీజేపీలోకి వెళ్ళే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. కాకపోతే ప్రస్తుతం నడుస్తున్న రాజకీయాలని బట్టి ఆగుతున్నారా? ఇంకా బీజేపీ బలపడే వరకు వెయిట్ చేస్తారా? అనేది క్లారిటీ లేదు.