ప్రధాని మోదీ గతేడాది ప్రకటించిన ఆత్మ నిర్భర భారత్ కార్యక్రమంలో భాగంగా ‘కూ’ అనే యాప్ విజేతగా నిలిచింది. కర్ణాటకకు చెందిన అప్రమేయ రాధాకృష్ణ, మయాంక్ బిడవట్క అనే ఇద్దరు యువకులు ఈ యాప్‌ను డెవలప్ చేశారు. గతేడాది ఏప్రిల్‌లో కన్నడ భాషలో ఈ యాప్ తొలుత అందుబాటులోకి రాగా తరువాత ఇంగ్లిష్, హిందీ భాషలను చేర్చారు. ప్రస్తుతం ఈ యాప్ తెలుగు, మరాఠీ, గుజరాతీ, తమిళం, మళయాళం, ఒరియా భాషల్లో యూజర్లకు లభిస్తోంది.
అయితే కూ యాప్ ప్రస్తుతం వార్తల్లో నిలిచిన నేపథ్యంలో ఆ యాప్‌కు గత 48 గంటల్లోనే 30 రెట్ల ఎక్కువ ఇన్‌స్టాల్స్ వచ్చాయి. ప్రస్తుతం ఈ యాప్ 30 లక్షల డౌన్‌లోడ్స్ ను పూర్తి చేసుకుంది. కాగా ట్విట్టర్‌తో కేంద్ర ప్రభుత్వానికి మధ్య కొనసాగుతున్న పరోక్ష యుద్ధం వల్ల కూ యాప్ బాగా లాభపడింది. ఈ యాప్‌లో ఇప్పటికే కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్, రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్, బీఎస్ ఎడియూరప్ప, తేజస్వి సూర్య వంటి రాజకీయ ప్రముఖులతోపాటు అనిల్ కుంబ్లే, జవగల్ శ్రీనాథ్ తదితర క్రికెటర్లు, ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు జగ్గీ వాసుదేవ్ లు అకౌంట్లను తెరిచారు.
ట్విట్టర్‌తో కేంద్ర ప్రభుత్వానికి జరుగుతున్న కోల్డ్ వార్ వల్ల అనూహ్యంగా కూ యాప్‌కు ప్రచారం లభించింది. ఈ క్రమంలో ఈ యాప్‌ను యూజర్లు పెద్ద ఎత్తున ఇన్‌స్టాల్ చేసుకుంటున్నారు. ఇక పలు కేంద్ర ప్రభుత్వ విభాగాలు కూడా ఈ యాప్‌లో అకౌంట్లను తెరిచాయి. ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్‌లలో యూజర్లకు అందుబాటులో ఉంది. ఇక దీనికి రేటింగ్స్ కూడా బాగానే వస్తుండడం విశేషం.