తమ ఫోన్లు ట్యాపింగ్ కు గురవుతున్నాయంటూ వైసీపీ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి బహిరంగంగా ఆరోపణలు చేస్తుండడం తెలిసిందే. దీనిపై పార్టీ సమన్వయకర్త బాలినేని శ్రీనివాసరెడ్డి స్పందిస్తూ, ఫోన్ ట్యాపింగ్ జరగలేదని అన్నారు. కోటంరెడ్డి స్నేహితుడే కాల్ రికార్డు చేసి లీక్ చేశాడని, దాన్నే ఫోన్ ట్యాపింగ్ అని అపోహపడుతున్నారని వ్యాఖ్యానించారు. బాలినేని వ్యాఖ్యలుకు కోటంరెడ్డి కౌంటర్ ఇచ్చారు.
ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టు రేపు నిరూపిస్తానని స్పష్టం చేశారు. సాక్ష్యాలతో మీడియా ముందుకు వస్తానని వెల్లడించారు. ఫోన్ ట్యాపింగ్ బయటపడితే ఇద్దరు ఐపీఎస్ ల ఉద్యోగాలు పోతాయని అన్నారు. వారి ఉద్యోగాలు పోతాయనే ఇప్పటివరకు బయటపెట్టలేదని కోటంరెడ్డి వివరించారు. ఇప్పుడు సాక్ష్యాలు బయటపెట్టక తప్పడంలేదని అన్నారు. వైసీపీలో అసంతృప్తులపై ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందన్న అంశం అందరికీ తెలియాలని పేర్కొన్నారు. ఏపీ అధికారపక్షం వైసీపీలో ఫోన్ ట్యాపింగ్ అంశం కలకలం రేపుతోంది.