Koti Deepothsavam 2022 : వెలుగుల పండుగ ‘కోటి దీపోత్సవం’

-

దీపావళి పండుగ పూర్తి కాగానే.. కార్తీక మాసం వస్తుంది. కార్తీక మాసం అంటే..మనకు దీపాలు గుర్తుకు వస్తాయి. అయితే.. కార్తీక మాసంలో వెలిగే ప్రతి ప్రమిద మంగళప్రదం అంటారు.. అదే ఒకే చోట.. ఓ వెలుగుల ఉత్సవం జరిగితే.. వేలాది మంది ఒకేచోట చేరి దీపాలు వెలిగిస్తే.. అది ‘కోటి దీపోత్సవం’ అవుతుంది.. అదే ఎన్టీవీ – భక్తి టీవీ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది నిర్వహించే కోటి దీపోత్సవం… హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ స్టేడియం వేదికగా ప్రతీ ఏడాది ఈ ఉత్సవం జరుగుతోంది.. ఈ ఉత్సవాలు జరిగినంత కాలం.. సంధ్యా సమయంలో.. ఓ కాంతివనంలా వెలుగిపోతాయి ఎన్టీఆర్‌ స్టేడియం, పరిసర ప్రాంతాలు.. ఇక్కడ భక్తజనులు వెలిగించే ప్రతి దెవ్వె మహాదువని కాలిమువ్వు అవుతుంది.

2012 నుంచి రచన టెలివిజన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్ అధినేత నరేంద్ర చౌదరి, రమాదేవి పుణ్య దంపతుల సంకల్పంతో.. ఈ కోటి దీపోత్సవం ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నారు.. దీపశిఖలు రెపలాడుతూ కోటికాంతులను పంచుతాయి. ఓంకారానికి వంతపాడే శంఖారావాలు, డమరుక ధ్వనులు, ఘనాపాఠీల వేదపారాయణాలు, జగద్గురువుల అనుగ్రహ భాషణాలు, పీఠాధిపతుల దివ్య ఆశీర్వచనాలు, మాతృశ్రీల మంగళశాసనాలు దీపోత్సవానికి ఆధ్యాత్మిక శోభను సంతరిస్తాయి. ఈ వేదికగా మహాదేవునికి ప్రీతికరమైన అభిషేకాలు, బ్రహ్మోత్సవంగా వివిధ వాహన సేవలు, వైభవంగా దేవీదేవతల కల్యాణాలు, విశేష పూజల వంటివి ఎన్నో భక్తుల మనసులను భక్తిపారశ్యంతో ముంచేస్తాయి.. ఇక, ఈ ఏడాది అక్టోబర్‌ 31వ తేదీతో ఆరంభమై.. నవంబర్‌ 14వ తేదీ వరకు కొనసాగనుంది కోటిదీపోత్సవం.

 

రచన టెలివిజన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్ అధినేత నరేంద్ర చౌదరి, రమాదేవి దంపతులు.. తొలిసారిగా 2012లో ఈ దీపాల ఉత్సవానికి నాంది పలికారు.. లక్ష దీపాల అంకురార్పణతో ప్రారంభమైన ఈ మహాదీపయజ్జం.. కోటిదీపోత్సవంగా మారింది.. క్రమంగా ఆధ్యాత్మిక జగత్తులో మహోద్యమంగా కొనసాగుతోంది. ప్రతీ ఏడాది నిరాటంకంగా కొనసాగుతోంది. ఆ కైలాసమే ఇలకి దిగివచ్చిందా అనేలా.. కోటిదీపోత్సవ వేదికను మూస్తాబు చేస్తున్నారు.. ఒక్కసారైనా కోటిదీపోత్సవానికి వెళ్లాలి అనేలా భక్తులలో ఉత్సాహాన్ని నింపుతుంది.. ఈ వేడుకకు విచ్చేసే ప్రతీ ఒక్కరినీ ప్రధానంగా ఆకర్షించేది.. ఆ వేదికే.. హిమగిరులు.. జలపాతాలు.. యోగముద్రలో శివుడు… శిఖరాలపై మహాదేవుని విభిన్నమూర్తులు.. శివలింగాలు… ఇల కైలాసాన్ని తలపిస్తుంది.

కార్తీక మాసంలో ప్రతిరోజూ ఆ నాటి విశిష్టతను బట్టి విశేష పూజలు నిర్వహిస్తారు.. చౌకీలపై సమస్త పూజాద్రవ్యాలను, దేవతాప్రతిమలను రచన టెలివిజన్‌ యాజమాన్యం ఉచితంగా భక్తులకు కోసం ఏర్పాటు చేస్తుంది.. నిత్యం ఎన్నో ఉత్సవాలు జరుగుతుంటాయి.. కానీ, ఒకే వేదికపై ఇన్ని కల్యాణాలు మాత్రం చూడడం ఎవరికీ సాధ్యం కాదు.. వివిధ క్షేత్రాల నుంచి ఉత్సవ మూర్తులను ఆలయ లాంఛనాలతో తీసుకువచ్చి ఆగమసంప్రదాయాన్ని అనుసరించి ఆయా ఆలయాల అర్చకస్వాములతో కల్యాణం జరిపించడం ఈ కోటిదీపోత్సవంలోనే చూడగలం.. ఇక, దీపారాధన ముగిసిన వెంటనే లిగోద్భవ దృశ్యాన్ని ఆవిష్కిస్తారు.. లింగాష్టకం నేపథ్యంలో లిగోద్భవం ఒక మహోత్సవంగా జరుగుతుంది.. కల్యాణ మూర్తలులందరికీ ప్రతిరోజూ వాహనసేవ. కోలాట బృందాలు ముందు నడుస్తుండగా.. ఆ ఉత్సవ మూర్తులు.. ప్రజల దగ్గరకు తరలివస్తారు.. ఇక, భక్తులు ఎన్టీఆర్‌ స్టేడియానికి రావడానికి కోటిదీపోత్సవం ముగిసిన తర్వాత తిరిగి వెళ్లడానికి ప్రతీ ఏడాది టీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సులను కూడా నడుపుతోంది.. ఈ నెల 31వ తేదీ నుంచి నవంబర్‌ 14వ తేదీ వరకు సాగనున్న కోటిదీపోత్సవంలో పాల్గొని విజయవంతం చేద్దాం.

Read more RELATED
Recommended to you

Latest news