కాంట్రాక్టర్లు ముందకు రాలేదు..

-

గత ఎన్నికల్లో తెరాస అధినేత ఇచ్చిన హామీల్లో డబుల్ బెడ్‍రూం ఇళ్లను పూర్తి చేసే విషయంలో తాను సంతృప్తిగా లేనని మంత్రి కేటీఆర్‌ అన్నారు. సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో నిర్వహించిన రోడ్‌షోలో ఆయన మాట్లాడుతూ..పేదలకు ఇచ్చే డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం కోసం సరైన స్థలం దొరకడం లేదు దీనికి తోడు కాంట్రాక్టర్లు కూడా ముందుకు రాకపోవడం వల్ల తీవ్ర జాప్యం జరిగిందన్నారు. ఈసారి తెరాస ప్రభుత్వం అధికారంలోకి వస్తే, మీకు ఎక్కడ స్థలం ఉంటే అక్కడ ఇల్లు కట్టుకునేందుకు రూ.5లక్షలు ఇస్తాం. ఇన్ని పనులు చేసినవాళ్లం అది వదిలేస్తామా? అన్నం ఉడికిందని తెలియడానికి ఒక్క మెతుకు పట్టుకుంటే చాలదా? అంటూ తెరాస చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. కేసీఆర్‌ పేదింటి పిల్ల పెళ్లయితే మేనమామ తరహాలో నేనున్నా అంటూ.. రూ.లక్ష ఇస్తున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పాఠశాలల్లో పురుగుల అన్నం పెట్టారు. కానీ, తెరాస సన్న బియ్యంతో భోజనం పెడుతోంది అని గుర్తుచేశారు.

భిన్న దృవాలైన తెదేపా-కాంగ్రెస్‌ కలుస్తాయని ఎన్నడైనా అనుకున్నారా?. కాంగ్రెస్‌ను బొందలో పెట్టేందుకే ఎన్టీఆర్‌ తెదేపాను స్థాపించారు. అలాంటిది చంద్రబాబు తెదేపాను కాంగ్రెస్‌ తోకపార్టీగా చేసేశారు. మహాకూటమి అంటూ ఐదు పార్టీల జెండాలు కప్పుకుని ఆ పార్టీల నాయకులు ఓట్ల కోసం తిరుగుతున్నారు. చూసిన జనాలంతా సంక్రాంతి పండగకు వచ్చే గంగిరెద్దులు ఇప్పుడే వచ్చాయని ఊళ్లలో అనుకుంటున్నారు. అంటూ విమర్శించారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే కేసీఆర్ నడుచుకుంటారంటూ తెలిపారు. కొన్ని మేనిఫెస్టోలో పెట్టని హామీలను సైతం ఆయన అమలుచేశారన్నారు. రైతు బంధు, రైతు బీమా, 24 గంటల పాటు నిరంతర విద్యుత్,..ఇలా అన్ని విషయాల్లో కేసీఆర్ దేశంలోనే ఆదర్శవంతమైన సీఎం గా పేరుతెచ్చుకున్నారన్నారు. మరో సారి ఆశీర్వదిస్తే బంగారు తెలంగాణ ను సాధించుకుందామన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version