డిసెంబరు 3 తర్వాత TSPSC ప్రక్షాళన.. నేనే బాధ్యత తీసుకుంటా : మంత్రి కేటీఆర్

-

తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేస్తామని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు. ఆ బాధ్యత తానే తీసుకుంటానని చెప్పారు. బీఆర్ఎస్ విద్యార్థి విభాగం సమావేశంలో మంత్రి కేటీఆర్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌, బీజేపీలు సామాజిక మాధ్యమాల్లో బీఆర్ఎస్​పై చేస్తున్న తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలని సూచించారు.

‘సామాజిక మాధ్యమాలను ఎన్నికల ప్రచారానికి విస్తృతంగా వినియోగించుకోవాలి. తెలంగాణ ఉద్యమ సమయంలో 10 ఏళ్లు ఉన్న పిల్లలకు ఇప్పుడు ఓటు హక్కు వచ్చింది. వారికి రాష్ట్ర ఏర్పాటుకు ముందు పరిస్థితిని, ప్రస్తుత అభివృద్ధిని వివరించాలి. గ్రూప్‌-2 రద్దు చేయాలని డిమాండ్‌ చేసింది బండి సంజయ్‌, ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కాదా? రద్దు చేస్తే గొడవ చేసింది కూడా వాళ్లే కదా? కోర్టులో కేసు వేసి గ్రూప్‌ 2 రద్దు చేయించారు. కడుపులో గుద్ది.. నోట్లో పిప్పరమెంటు పెడతారు. కొన్ని చోట్ల తప్పులు జరిగాయి. అది నేనే ఒప్పుకొంటాను. డిసెంబరు 3 తర్వాత టీఎస్‌పీఎస్సీని ప్రక్షాళన చేయటానికి నేనే బాధ్యత తీసుకుంటా. తెలంగాణ ఉద్యమ సమయంలో వందల మంది యువత బలిదానాలకు కారణమైన కాంగ్రెస్‌ను పొరపాటున కూడా నమ్మొద్దు.’ అని మంత్రి కేటీఆర్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news