‘మాటలు చెప్పడం ఎవరికైనా ఈజీనే.. రాజకీయ నాయకులు ఎన్నైనా మాట్లాడొచ్చు.. ఎంతైనా విమర్శలు చేయొచ్చు.. నోటికివచ్చినట్లు మాట్లాడ్డం పెద్ద కష్టమేం కాదు.. కానీ పనులు చేయడం కష్టం.. ప్రజల సంక్షేమానికి పాటుపడటం కష్టంతో కూడుకుంది.’ అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. మన ఊరు-మనబడి కార్యక్రమంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో నిర్మించిన కేజీ టు పీజీ విద్యాలయాన్ని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు.
సంక్షేమ పథకాలు ప్రకటించి అమలు చేయాలంటే చాలా కష్టమని, ఈ కష్టాలన్నింటినీ తట్టుకుంటూ తాము పనులు చేస్తున్నామని చెప్పారు. 2004లో సీఎం కేసీఆర్ పర్యటనలో భాగంగా ఒకే ప్రాంగణంలో కేజీ నుంచి పీజీ విద్యాసంస్థలను అందుబాటులోకి తీసుకొస్తానని ఇచ్చిన హామీ నేటికి కార్యరూపం దాల్చిందన్నారు. ఈ నమూనాను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయడంలో భాగంగా మన ఊరు- మన బడి పథకాన్ని తీసుకొచ్చామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మెరుగైన ప్రమాణాలతో, ప్రపంచంతో పోటీ పడే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు వెయ్యికిపైగా గురుకుల పాఠశాలలను సీఎం కేసీఆర్ నాయకత్వంలో నెలకొల్పినట్లు చెప్పారు.