తొర్రూరులో నేడు జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో ఐటీ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా 20వేల మంది మహిళలతో నిర్వహించిన భారీ బహిరంగ సభలో కేటీఆర్ ప్రసంగించారు. ‘సంసద్ ఆదర్శ గ్రామీణ యోజన పథకం ఉన్నది. పార్లమెంట్ సభ్యులు తమ నియోజకవర్గంలోని ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకొని, దాన్ని అభివృద్ధి చేయడం ఈ కార్యక్రమం యొక్క మూల ఉద్దేశం. సంసద్ ఆదర్శ గ్రామీణ యోజనలో భారతదేశంలో అతి ఉత్తమమైన 20 గ్రామ పంచాయతీలు ఎక్కడ ఉన్నయ్ లెక్క తీస్తే.. అందులో 19 మన తెలంగాణేలోనే ఉన్నయ్. గత ఆరు నెలలకు సంబంధించిన ర్యాంకుల విడుదల కావడం జరిగింది.
త్రీస్టార్, ఫోర్‌స్టార్ పేరుతో జిల్లాలకు స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకింగ్స్, రేటింగ్స్ లభించాయి. పంచాయతీరాజ్ శాఖతోనే ర్యాకులు వస్తాయి. త్రీస్టార్, ఫోర్‌స్టార్‌లో ఒకటి నుంచి ఆరు ర్యాంకులకు అవార్డులు ఇస్తే, ఇందులో నాలుగు జిల్లాలు తెలంగాణవే ఉండడం జరిగింది. పల్లె ప్రగతి కార్యక్రమంలో రాష్ట్రంలో ఏ గ్రామానికి వెళ్లినా సీఎం కేసీఆర్ మార్గదర్శకత్వంలో పంచాయతీరాజ్ శాఖ అద్భుతమైన కార్యక్రమాలు చేపడుతున్నది. గ్రామస్థాయి వార్డు సభ్యుడు, కార్యదర్శి నుంచి రాష్ట్ర స్థాయి అధికారుల వరకు అందరూ సీఎం కేసీఆర్ ఆలోచన మేరకు పని చేస్తున్నందుకే అవార్డులు వస్తున్నాయని ఆయన వెల్లడించారు.