సమైక్య రాష్ట్రంలో కరెంట్ ఉంటే వార్త అని.. స్వరాష్ట్రంలో కరెంట్ పోతే వార్త అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమంలో దూసుకుపోతోందని తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దుమాల, రాజన్నపేట, బాక్రుపల్లి తండా, తిమ్మాపూర్ గ్రామాల్లో పర్యటించిన కేటీఆర్.. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.
నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి కేటీఆర్.. ఇళ్లు లేని నిరుపేదలకు గృహలక్ష్మి కింద ఇళ్లను మంజూరు చేస్తామని తెలిపారు. గ్రామంలో రోడ్ల వెంబడి డైనేజీలను నిర్మిస్తున్నామని వెల్లడించారు. కుట్టు శిక్షణ తీసుకున్న మహిళలకు 90 కుట్టు మిషన్లను వారం రోజుల్లోగా ఇస్తామని చెప్పారు. రైతు భీమా పథకం తెలంగాణ మినహా ప్రపంచంలో ఎక్కడా లేదని అన్నారు. రైతు చనిపోతే బీమా ఇచ్చే ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వేమని గుర్తు చేశారు. దేశంలో ఉన్న ఆదర్శ గ్రామాల్లో సింహ భాగం తెలంగాణ రాష్ట్రంలోనివేనని కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు.