ఒక లక్ష్యంతో ముందుకు సాగితే విజయం వరిస్తుంది : కేటీఆర్‌

-

ఒక లక్ష్యంతో ముందుకు సాగితే విజయం వరిస్తుందని, దీనికి ముఖ్యమంత్రి కేసీఆర్ జీవితమే ఉదాహరణ అని మంత్రి కేటీఆర్ అన్నారు. గురువారం హైదరాబాద్ పార్క్ హయత్ హోటల్లో గిరిజన పారిశ్రామికవేత్తల సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సీఎం కేసీఆర్ మారుమూల ప్రాంతంలో పుట్టారని, ముంబైలోని షాపూర్ జీ పల్లోంజీ కంపెనీలో కాంట్రాక్టులు చేశారన్నారు. రాజకీయాల్లోకి ప్రవేశించిన మొదట్లో సింగిల్ విండో ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారన్నారు. అయినా పట్టుదలతో ముందుకు సాగారన్నారు. ఆ తర్వాత ఎన్నికల్లో గెలిచిన కేసీఆర్, తిరిగి వెనక్కి చూసుకోలేదన్నారు.

ఎదురు దెబ్బలు అనేవి జీవితంలో అందరికి తగులుతాయి…కానీ వాటిని తట్టుకుని నిలబడితేనే గెలుపు వరిస్తుందన్నారు. అటువంటి ఓటములు గెలుపుకు తొలి మెట్టు అని ముందుకు సాగితే విజయం తప్పకుండా వస్తుందని సూచించారు. అవకాశాలను అందిపుచ్చుకుంటు ముందుకెళ్లిపోవాలని గిరిజన పారిశ్రామిక వేత్తలకు సూచించారు. కులాలు దేవుడు పుట్టించినవి కాదని గెలుపుకు కులం అవసరం లేదన్నారు. కృషి, పట్టుదల ఉంటే దేనిలో అయినా విజయం సాధించవచ్చని దానికి సీఎం కేసీఆర్ ఓ ఉదాహరణ అన్నారు. తెలివితేటలు అందరికి ఉంటాయి కానీ అంది వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవటంలో వాటిని చూపించాలన్నారు. వ్యాపారంలో పోటీ ఉండాలని అలాంటప్పుడే విజయాలు సాధించగలుగుతామన్నారు. వ్యాపారంలో విజయం సాధించినవారిని స్ఫూర్తిగా తీసుకోవాలని ఈరోజు స్టార్టప్ లుగా మొదలైనవారు రేపు రాబోయేవారికి స్ఫూర్తిగా నిలవాలని సూచించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యాపారులకు మంచి ప్రోత్సాహకాలు అందిస్తోంది అంటూ ఈ సందర్బంగా మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version