ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో 18 ఏళ్లకు పైబడిన వారికి కోవిడ్ వ్యాక్సిన్ ( Covid Vaccine ) ను వేస్తున్న సంగతి తెలిసిందే. అయితే గర్భిణీలు, పాలిచ్చే తల్లులు కూడా వ్యాక్సిన్లను వేయించుకోవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే స్పష్టం చేసింది. దీంతో పలు దేశాల్లో వారికి కూడా టీకాలు వేస్తున్నారు. అయితే కోవిడ్ టీకాలను వేయించుకున్న బాలింతల్లో పాల ద్వారా పిల్లలకు వ్యాక్సిన్ సరఫరా కాదని సైంటిస్టులు చేపట్టిన తాజా పరిశోధనల్లో వెల్లడైంది.
యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా – శాన్ ఫ్రాన్సిస్కోలకు చెందిన పరిశోధకులు సరాసరి 37 ఏళ్ల వయస్సు ఉన్న వ్యాక్సిన్లు తీసుకున్న 7 మంది బాలింతల నుంచి పాల శాంపిల్స్ ను సేకరించారు. వారు ఎంఆర్ఎన్ఏ ఆధారిత ఫైజర్, మోడెర్నా టీకాలను వేయించుకున్నారు. అయితే వారి పాల శాంపిల్స్ ను విశ్లేషించగా వాటిలో కోవిడ్ వ్యాక్సిన్ తాలూకు పదార్థాలు, సమ్మేళనాలు ఏవీ లేవని నిర్దారించారు. అందువల్ల గర్భిణీలు, పాలిచ్చే తల్లులు నిర్భయంగా టీకాలను వేయించుకోవచ్చని, దీంతో వారి పిల్లలకు ఏమీ కాదని సైంటిస్టులు చెబుతున్నారు.
కాగా ఈ పరిశోధనలకు చెందిన వివరాలను జామా పీడియాట్రిక్స్‌లో వెల్లడించారు. ఈ పరిశోధనల వల్ల కోవిడ్ టీకాలను తీసుకునేందుకు సంశయించే అనేక మంది గర్భిణీలు, బాలింతలకు డౌట్స్ క్లియర్ అవుతాయని సైంటిస్టులు తెలిపారు. దీని వల్ల మరింత మంది టీకాలను తీసుకుంటారని తెలిపారు. టీకాలను తీసుకుంటే తమ పిల్లలకు ఏమైనా అవుతుందేమోనన్న భయంతో కొందరు టీకాలను తీసుకోవడం లేదని, అలాంటి వారు ఈ పరిశోధనలతో టీకాలను వేయించుకుంటారని అన్నారు.