లగడపాటి రాజగోపాల్..రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కరలేని పేరు. అసలు లగడపాటి అంటే మొదట గుర్తొచ్చేవి సర్వేలు, పెప్పర్ స్ప్రే. గతంలో విజయవాడ రాజకీయాల్లో కాంగ్రెస్‌లో కీలకంగా పనిచేసిన లగడపాటి…ఎంపీగా పనిచేసిన విషయం తెలిసిందే. అలాగే ఎన్నికల సమయంలో తన సర్వేలతో ముందుకొచ్చేవారు. ఎన్నికల సమయంలో ఏ పార్టీ గెలుస్తుందో చెప్పేవారు. 2014 వరకు లగడపాటి సర్వేలు సక్సెస్ అయ్యాయి. కానీ 2018 తెలంగాణ ఎన్నికలు, 2019 ఏపీ ఎన్నికల్లో లగడపాటి సర్వేలు ఫెయిల్ అయ్యాయి. దీంతో ఆయన ఇంకా సర్వేలు చేయనని చెప్పేశారు.
ఇదే క్రమమంలో లగడపాటి వారసుడు టీడీపీలో చేరనున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. టీడీపీ సోషల్ మీడియాలో ఈ ప్రచారం జరుగుతుంది. లగడపాటి వారసుడు టీడీపీలోకి వస్తున్నారని, అలాగే ఆయనకు గన్నవరం సీటు ఇస్తారని కథనాలు వస్తున్నాయి. ప్రస్తుతం గన్నవరంలో టీడీపీకి సరైన నాయకుడు లేరు. టీడీపీ నుంచి గెలిచిన వల్లభనేని వంశీ వైసీపీ వైపుకు వెళ్ళడంతో గన్నవరంలో టీడీపీకి నాయకుడు లేరు.
బచ్చుల అర్జునుడుని ఇంచార్జ్‌గా పెట్టారు గానీ…ఆయన పెద్దగా ఎఫెక్టివ్‌గా పనిచేయడం లేదు. దీంతో ఇంచార్జ్‌ని మార్చాలని ఎప్పటినుంచో చర్చ నడుస్తోంది. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ భార్య గద్దె అనురాధాని ఇంచార్జ్‌గా పెట్టాలని డిమాండ్ వచ్చింది. కానీ ఇప్పుడు లగడపాటి వారసుడుకు గన్నవరం సీటు ఫిక్స్ చేస్తారని ప్రచారం మొదలైంది. మరి ఈ ప్రచారం ఎంతవరకు నిజమవుతుందో చూడాలి.