టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, సౌతిండియన్ హీరోయిన తమన్నా భాటియాను అరెస్ట్ చేయాలంటూ ఓ న్యాయవాది మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆన్‌లైన్ గేమ్‌లకు ప్రచారం చేస్తూ పలువురి మరణాలకు కారణమవుతున్నారంటూ ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. అలాగే ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతున్నయాప్స్ ను కూడా నిషేధించాలని డిమాండ్ చేశారు. ఆన్‌లైన్ అవకతవకలకు పాల్పడే కొన్ని కంపెనీలు, యాప్స్.. విరాట్ కోహ్లీ, తమన్నాలను తమ ఉత్పత్తులకు ప్రచారకర్తలుగా వాడుకుంటూ యువతను నమ్మిస్తున్నాయని ప్రస్తావించారు.
ఇది నమ్మిన చాలా మంది మోసపోయారని, ఈ విషయంలో బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్న విరాట్ కోహ్లీ, తమన్నాలను అరెస్ట్ చేయాలని పిటిషన్‌లోపేర్కొన్నారు. గ్యాంబ్లింగ్ మహమ్మారి సమాజానికి చాలా ప్రమాదకరమని, ఇది జీవించే హక్కును కాలరాస్తోందని, రాజ్యాంగంలోని 21వ అధికరణకు ఇది విరుద్ధమని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇటీవలే ఓ యువకుడు ఈ ఫేక్ యాప్స్‌లో డబ్బులు పోగొట్టుకొని ఆత్మహత్య చేసుకున్నాడని, ఆకేసుకు సంబంధించిన వివరాలను ఈ పిటిషన్‌కు జత చేశాడు. ఇక ఈ పిటిషన్‌పై ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టనున్నట్లు తెలుస్తోంది.