ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్ లో జరిగిన సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది.19ఏళ్ల బాలికపై జరిగిన సామూహిక అత్యాచారంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఆ బాలిక చికిత్స పొందుతూ మృతి చెందడం, ఆ తర్వాత పోలీసులు బాలిక అంత్యక్రియలని కుటుంబ సభ్యులకి కూడా తెలియనివ్వకుండా జరిపించడం అనుమానాస్పదంగా మారింది. ఈ నేపథ్యంలో ఆ బాలిక కుటుంబానికి న్యాయం చేయాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. కుటుంబ సభ్యులకి కూడా తెలియకుండా అంత్యక్రియలు జరిపడంపై వివరణ ఇవ్వాలని నేషనల్ కమీషన్ ఫర్ వుమెన్ డీజీపీని ప్రశ్నించింది.
ఐతే తాజగా ఉత్తరప్రదేశ్ వ్యాయవాదులు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని కోరుతున్నారు. ఇలాంటి అమానుష చర్యల వల్ల రాష్ట్ర ప్రగతి దెబ్బతింటున్నందున ముఖ్యమంత్రిని తొలగించి రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై ఆందోళన చేపట్టిన న్యాయవాదులు సివిల్ కోర్ట్ నుండి జిలా కలెక్టరేట్ వరకు కవాతు చేసారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ, రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులని నివారించడంలో ముఖ్యమంత్రి విఫలమయ్యాడని నిరసన వ్యక్తం చేసారు.