సందర్భం : జూన్ 15 వర్ధంతి
హరోం హర హరోం హర హర హర హర
ఒరేయ్ ఏవి ఆ మహోద్రేకాలు
ఏవిరా నిరుడు కురిసిన విప్లవ గీతాలు
ఏదిరా పాట యాడరా నీ మాట
హరోం హర .. అరిస్తే వాద్యం అన్నోడ్ని తంతాను స్మరిస్తే పజ్యెం అన్నోడ్ని తంతాను..నీ అంత కవికి ప్రత్యామ్నాయం ఎవ్వడైనా రాగలడా! ఇది మా దరిద్రం మేం రాస్తున్నదంతా దరిద్రమే!
…………………………
రాస్తే గ్రంథం పూస్తే గంథం ఒకడికి
రాయని గ్రంథం రాసినా ఆ కాసిన్ని అక్షరాలు ఏం చేస్తాయనట!
ధారాపాతంగా వచ్చే కన్నీరు విశాఖ తీరాన ఆ కవికి నివాళి
ఈ రోజు వాడు చనిపోయినాడు.. ఓహో! ఓ యుగం ఆగినదా పుట్టినదా!
…………………………
ఒరేయ్ నిప్పులు కక్కాలా నింగికి ఎగరాలా ..నిభిడాశ్చర్యాలతో ఇచ్చోటనే నేను ఎక్కడికో నీవు/అవును మేమంతా ఇప్పటికీ నీవన్నట్లే సంధ్యా జీవులం సందేహభావులం సిరిసిరిరావులం
…………………………
పరిప్లవిస్తూ
పరిభ్రమిస్తూ
పరిశ్రమిస్తూ ఏం చేసినా దారిద్ర్యం అనే దాస్య శృంఖలం అలానే ..
ఒకపరి నేనొక శృగాలం ఒకపరి నేనొక బిడాలం తప్పదిక ఈ వ్యాఘాతం
…………………………
ఏది సమర్పణం ఏది సమర్చనం నీవే తేల్చు
ఒరేయ్ మనస్సినీవాలీలో పాట గతి మారిపోయింది
నీ వెచ్చని నీడ ఇక లేదురోయ్..హృదంతరాళాల గర్జించు కవి లేడు ఇక రాడు
మేమంతా దరిద్రులం.. రాసినా రాయకున్నా నువ్వేరా యుగకవి మహా కవి
అవును బలవత్ ఝరవత్ రసవత్ పరివర్తన అనగా ఆ సంగతేదో నీవే తేల్చవోయ్..జీవితానికి మించిన కావ్యం ఏదని? కనుక ఇంకెప్పుడూ నీ మార్కు కవిత్వం నా నుంచి కోరకు ఈ వేళ నీకిదే ఘన నివాళి .. మరో కవి లేడు ఉన్నాడు కాని వాడు మహా కవి కాడు/విన్నానమ్మా విన్నాను నే విన్నవి కన్నవి వినుతిస్తే ఇలా ఉంటాయ్ అచ్చం శ్రీశ్రీలా..
– రత్నకిశోర్ శంభుమహంతి