ఒకపక్క కరోనా విజృంభణ.. మరోపక్క కొన్ని రాష్ట్రాల్లో మిడతల దండయాత్రతో భారత్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసింది. అయితే ఈ మిడతల ముప్పు తెలంగాణకు కూడా ఉంటుందని అంచనా వేశారు. దీంతో ప్రభుత్వం వాటిని అడ్డుకునేందుకు సిద్ధమవుతున్న తరుణంలో అనూహ్యంగా మిడతల ముప్పు తెలంగాణకు తాత్కాలికంగా తప్పినట్టే అని వార్తలు వస్తున్నాయి. మహారాష్ట్రలోని రాంటెక్ నుండి మిడతల దండు మధ్యప్రదేశ్ వైపు పయనించి మెహడే అనే గ్రామంలో ఆగాయని మహారాష్ట్ర అధికారులు తెలిపారు. అయితే మిడతలు దక్షిణ దిశగా పయనించి ఉంటె తెలంగాణకు చేరేవని..అయినప్పటికీ అవి ఎప్పుడు ఎటు ప్రయాణిస్తాయో తెలియదు కాబట్టి సరిహద్దు జిల్లాల అధికారులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.