టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తలపెట్టిన యువగళం పాదయాత్ర రేపు ఉదయం కుప్పంలో ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలో టీడీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఈ నెల 27 నుంచి ఉదయం 10.15 గంటల సమయంలో ఆయన వరదరాజుల స్వామి ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. అనంతరం 11.03 గంటలకు పాదయాత్రను ప్రారంభిస్తారు. మొత్తం 400 రోజుల పాటు 4 వేల కిలోమీటర్ల పాటు ఈ సుదీర్ఘ పాదయాత్ర కొనసాగనుంది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు యువగళం సభలో ఆయన పాల్గొంటారు.
సభ అనంతరం కుప్పంలో ప్రభుత్వ ఆసుపత్రి శెట్టిపల్లె క్రాస్, బెగ్గిలిపల్లె క్రాస్ మీదుగా యాత్ర కొనసాగుతుంది. రాత్రి సమయానికి ఆయన బస చేసే ప్రాంతానికి చేరుకుంటారు. తొలిరోజు ఆయన పాదయాత్ర 8.5 కిలోమీటర్ల మేర కొనసాగనుంది. కుప్పంలో పాదయాత్ర ప్రారంభం కానున్న సందర్భంగా తన అల్లుడు లోకేశ్ ప్రజాసమస్యలు తెలుసుకునేందుకు, యువతకు జరుగుతున్న అన్యాయాన్ని నిలదీసేందుకే యువగళం చేపడుతున్నాడని బాలకృష్ణ స్పష్టం చేశారు. రేపటి పాదయాత్రలో లోకేశ్ తో పాటు తాను కూడా పాల్గొంటున్నట్టు వెల్లడించారు.